గోదావరిఖని, ఏప్రిల్ 8 : రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ప్రజాధనాన్ని పందికొక్కుల్లా మేస్తూ సింగరేణిని కొల్లగొడుతున్నారని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి టెండర్లలో సైట్ విజిట్ నిబంధన పేరిట రూ.కోట్ల బొగ్గు కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రుల అనుచరులు, బంధువులకు బొగ్గు గనులను ఓబీ(ఓవర్ బర్డెన్) కాంట్రాక్ట్‌లు కట్టబెట్టే విధంగా చేశారని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌కు చెందిన శోధా కంపెనీకే ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానంలో తొలి టెండర్‌ను కట్టబెట్టినట్టు తెలిపారు. సింగరేణికి సరఫరా చేసే ఎక్స్‌ప్లోజివ్స్ (పేలుడు పదార్థాలు) టెండర్లలో కూడా అధిక ధరలకు కోడ్‌చేసి కంపెనీకి రూ.వందల కోట్ల నష్టం చేశారని ధ్వజమెత్తారు. సింగరేణి ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన టెండర్లలోనూ దేశంలో ఎక్కడా లేనివిధంగా అధిక ధరలకు సంబంధిత అనుచరులకు కట్టబెట్టారని, దీంతో సంస్థకు రూ.500 కోట్ల నష్టం జరిగిందని వివరించారు.