Seetharama Lift | జూలూరుపాడు, ఆగస్టు 12: ప్రాజెక్టు కోసం మా భూములు కోల్పోయాం.. మా కండ్ల ముందు నుంచి నీళ్లు వెళ్తున్నాయి.. మా చెరువులు నింపకుండా ఇతర ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు.. కాంగ్రెస్ సర్కారు రీడిజైన్‌తో మాకు తీరని అన్యాయం చేసింది.. మాకు నీళ్లియ్యకుండా తరలిస్తే చూస్తూ ఊరుకోం.. అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల రైతాంగం ప్రతినబూనింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం రీడిజైన్ చేసింది. జూలూరుపాడు మండలంలోని వినోభానగర్ సమీపం నుంచి ఏన్కూరులో ఉన్న సాగర్ కాల్వ వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర లింక్ కెనాల్‌కు నిధులు కేటాయించి ఆగమేఘాల మీద పనులను పూర్తిచేశారు. ఈ నెల 15న సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. తమ మండలంలోని చెరువులన్నింటినీ నింపకుండా నీటిని మళ్లించి తరలించుకు వెళ్తున్నారని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏన్నో ఏళ్లుగా సాగునీటి కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న తమ ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అఖిలపక్షం ఆధ్వర్యంలో గత కొన్నిరోజులుగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. గత కొంతకాలంగా వినతిపత్రాల అందజేత, జలదీక్ష, ధర్నాలతో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంత రైతుల భూములను ఎండబెడుతూ సొంత ప్రయోజనాల కోసం నీటిని తరలించుకుపోతున్న కాంగ్రెస్ మంత్రుల నిర్ణయాలను ఎండగడతామని రైతులు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
జూలూరుపాడు మండల పరిధిలోని నల్లబండబోడు గ్రామ సమీపం నుంచి రామచంద్రాపురం, గుండెపుడి, ఓంటిగుడిసె, జూలూరుపాడు, వినోభానగర్, పాపకొల్లు, పుల్లుడు తండా మీదుగా పాపకొల్లు అటవీ ప్రాంతమైన పోలవరం ప్రాజెక్టు సరిహద్దు వరకు సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇక్కడ నుంచి ఎత్తయిన గుట్టకు సొరంగమార్గం వేసి నీటిని కారేపల్లి మండలం ద్వారా వైరా, పాలేరు పరిధిలోని చెరువులకు తరలించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో డిజైన్ రూపొందించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రీడిజైన్ చేసి వినోభానగర్ నుంచే నీటిని మళ్లించడంతో జూలూరుపాడు మండలంలోని అన్ని చెరువులను నింపేందుకు వీలులేకుండా పోయింది. దీంతో ఈ ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్నారు.
జూలూరుపాడు మండలంలోని అన్ని చెరువులకు నీటిని అందిస్తామని గ్రామసభల్లో అధికారులు హామీ ఇచ్చారు. మా ప్రాంతానికి నీరివ్వకుండా నీటిని తరలించుకుపోతుంటే చూస్తూ ఊరుకోం. మాకు సాగునీటిని ఇవ్వకుంటే మా భూములు మాకివ్వాలి.
బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన డిజైన్ ప్రకారమే సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలి. భూములను కోల్పోయిన మాకే మొదట నీరిచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు తరలించుకుపోవాలి. ఈ ప్రాంతానికి సాగునీరందించేదాకా రైతులందరం ఆందోళన చేస్తూనే ఉంటాం.