హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్న వారిపై సిట్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సోమవారం సిట్ నోటీసులు జారీ చేసి, ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు ఆరోపణలు చేసిన ఇతరులకు నోటీసులు సిద్ధం చేసింది. జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి ఇంటికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు వెళ్లి నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటికి అతికించారు.
బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన 64/2023 కేసు, సీసీఎస్ నేతృత్వంలోని సిట్‌కు బదిలీ కావడంతో క్రైమ్ నంబర్ 95/2023 కేసు నమోదు చేసి, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్ట్ చేసి, కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నామని సిట్ నోటీసులో పేర్కొన్నది. ఈ క్రమంలోనే దర్యాప్తు కొనసాగుతున్న కేసుకు సంబంధించిన అంశంపై 19వ తేదీన కామారెడ్డి జిల్లా గాంధారిలో రేవంత్‌రెడ్డి మాట్లాడారని సిట్ తెలిపింది. ‘అందులో మాకు అందుతున్న సమాచారం ప్రకారం గ్రూప్-1 పరీక్ష రాసిన వారిలో దాదాపు వంద మందికి 103 మార్కుల కంటే ఎక్కువగా వచ్చాయని, కేటీఆర్ పీఏ తిరుపతి, ఈ కేసులో రెండో ముద్దాయిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి ఒకే మండలానికి చెందినవారని, వారిద్దరు అత్యంత సన్నిహితులని, ఇటు తిరుపతి, అటు రాజశేఖర్‌రెడ్డి సన్నిహితులు, కుటుంబసభ్యులు గ్రూప్-1 పరీక్షలో అత్యధిక మార్కులు సాధించారని ఆరోపణలు చేశారు’ అని సిట్ నోటీసులో పేర్కొన్నది.
పూర్తి వివరాలతో రండి
జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన 100 మంది 103 మార్కులు సాధించారని చేసిన ఆరోపణలకు సంబంధించిన సమాచారం, ఆ వంద మంది వివరాలతో ఈ నెల 23న హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సిట్ ఆదేశించింది. ఈ వివరాలు దర్యాప్తునకు ఎంతో అవసరమన్న సిట్.. దర్యాప్తు అధికారి అయిన ఏసీపీ, ఇన్స్పెక్టర్ సీహెచ్ నరేందర్‌రావు ద్వారా ఈ నోటీసులు పంపించారు. పేపర్ లీకేజీపై ఇష్టానుసారం ఆరోపణలు చేసిన బండి సంజయ్‌కి సైతం నోటీసులు సిద్ధమయ్యాయి. మంగళవారం ఆయనకు నోటీసులు పంపించేందుకు సిట్ కసరత్తు చేస్తున్నది. ఆరోపణలు చేసినవారు ఆధారాలను సిట్‌కు ఇవ్వడం వల్ల మరింత లోతైన దర్యాప్తు సాధ్యమవుతుందని సిట్ భావిస్తూ ఈ నోటీసులను జారీ చేస్తున్నది.