హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు గురువారం నాలుగోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఉదయం సిట్ కార్యాలయానికి వచ్చిన ఆయనను, సుమారు తొమ్మిది గంటలపాటు విచారించారు. శుక్రవారం కూడా విచారణకు రావాలని సిట్ అధికారులు ప్రభాకర్‌రావును కోరినట్టు తెలిసింది.
ఆయన ఇచ్చిన సమాధానాల ఆధారంగా డీజీపీ జితేందర్, మాజీ ఇంటెలిజెన్స్ డీజీ అనిల్‌కుమార్ నుంచి సిట్ పలు సమాధానాలు రాబట్టింది. గురువారం నాటి విచారణలో వారు ఇచ్చిన సమాధానాలతో ప్రభాకర్‌రావును ప్రశ్నించినట్టు తెలిసింది. కాగా, ఈ కేసులో కీలకంగా ఉన్న మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి స్టేట్మెంట్ తీసుకునే విషయంలో సిట్ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. మహేందర్‌రెడ్డి డీజీపీగా ఉన్న సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొనసాగింది.