TSPSC | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీపై దర్యాప్తు జరుపుతున్న సిట్.. టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, కమిషన్ సభ్యుడు లింగారెడ్డిని ప్రశ్నించింది. హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయంలో శనివారం ఈ ఇద్దరిని వేర్వేరుగా సిట్ చీఫ్, నగర పోలీస్ అదనపు కమిషనర్(క్రైమ్స్) ఏఆర్ శ్రీనివాస్, ఇతర అధికారులు దాదా పు రెండున్నర గంటలపాటు విచారించారు. అనితా రామచంద్రన్‌కు పీఏగా ఉన్న ప్రవీణ్‌కుమార్ పేపర్ల లీకేజీలో ప్రధాన నిందితుడన్న సంగతి తెలిసిందే. ఇతని ద్వారానే లింగారెడ్డి పీఏ రమేశ్‌కు గ్రూప్-1 పేపర్ అందింది.
ఈ నేపథ్యంలో సిట్ అధికారులు అనితా రామచంద్రన్‌ను.. ప్రవీణ్‌కుమార్ మీ వద్ద పీఏగా ఎలా వచ్చాడు? పీఏలుగా వచ్చే వారి అర్హత, వారి విధివిధానాలు ఏమిటి? ప్రవీణ్‌పై గతంలో వచ్చిన ఆరోపణలు, తీసుకున్న చర్యలు, ప్రశ్నాపత్రాలు ఉండే విభాగానికి, మీకు మధ్య ఉండే సంబంధాలు, కస్టోడియన్ శంకర్ లక్ష్మిపై ఏమైనా ఆరోపణలున్నాయా? ఏటా సైబర్ ఆడిటింగ్ జరిగిందా? ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర ఏంటి? టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ కమిషన్ ఆధ్వర్యంలో జరిగే పరీక్షలు రాయవచ్చా? మీ పీఏ గ్రూప్-1 పరీక్ష రాస్తున్న విషయం మీకు తెలుసా? తదితర అంశాలపై ఆమెను ప్రశ్నించినట్టు తెలిసింది. దీనికి అనితా రామచంద్రన్ సవివరంగా సమాధానాలిచ్చినట్టు సమాచారం.
అనితా రామచంద్రన్ తరువాత సిట్ కార్యాలయానికి బండి లింగారెడ్డి వచ్చారు. అంతకుముందే ఆయన పీఏ రమేశ్‌ను సిట్ పిలిపించినట్టు తెలిసింది. కమిషన్ పీఏలు కేవలం కార్యాలయం వరకే పరరిమితమవుతారా? బయట కూడా వారితో ఉంటారా? రమేశ్ ప్రవర్తన ఎలా ఉండేది, మీ పీఏ గ్రూప్-1 పరీక్ష రాస్తున్నట్లు మీకు తెలుసా? అతనిపై ఎప్పుడైనా మీకు అనుమానం కలిగిందా? తదితర ప్రశ్నలు వేసి సిట్ స్టేట్మెంట్ తీసుకుంది.
పేపర్ లీకేజీ ఘటనలో ఇప్పటి వరకు 15 మంది అరెస్టయ్యారు. ప్రధాన నిందితులను రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని విచారించారు. గ్రూప్-1 పరీక్ష రాసి వందకుపైగా మార్కులు తెచ్చుకున్న సురేవ్, రమేశ్, షమీమ్‌లను కస్టడీలో నాలుగో రోజు విచారించారు. ఏఈ పేపర్ కొనుగోలు చేసిన ప్రశాంత్‌రెడ్డి, రాజేంద్రకుమార్, తిరుపతయ్యలను కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ విచారణలో పోలీసులు సేకరించిన అంశాలతో ఒక నివేదికను తయారు చేస్తున్నది. కమిషన్ చైర్మన్, మిగతా సభ్యుల నుంచి సమాచారం అవసరమైతే వారికి కూడా సిట్ నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది.