హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): బెట్టింగ్ యాప్స్‌తో తెలుగు రాష్ర్టాల్లో ఆర్థిక విధ్వంసం, బాధితుల ఆత్మహత్యలపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దీనిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీచేశారు. ఇన్స్పెక్టర్ జనరల్ ఎం రమేశ్ నేతృత్వంలోని ఈ బృందంలో ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధు శర్మ, సీఐడీ ఎస్పీ వెంకటలక్ష్మి, సైబరాబాద్ అదనపు ఎస్పీ చంద్రకాంత్, సీఐడీ డీఎస్పీ శంకర్‌ను నియమించారు. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నవారిపై పంజాగుట్టతోపాటు సైబరాబాద్‌లోని మియాపూర్‌లో ఇప్పటికే 2 కేసులు నమోదవడంతో పలువురు ఇన్ఫ్లూయెన్సర్లను విచారించారు.
ఈ 2 కేసుల్లో 25 మంది టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు, టీవీ యాంకర్లు, యూట్యూబర్స్ ఉన్నారు. ఈ 2 కేసులను సిట్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక నిపుణులు, న్యాయాధికారులు, ఆడిటర్లు, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ నిపుణులను సిట్‌లో చేర్చుకునే అవకాశం ఉన్నది. ఈ బృందం కేవలం కేసులను దర్యాప్తు చేయడమే కాకుండా బెట్టింగ్ యాప్స్ తీరుతెన్నులపై అధ్యయనం జరిపి 90 రోజుల్లో డీజీపీకి నివేదిక సమర్పించనున్నది.