KCR | హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): ఫోన్‌ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారించే నిమిత్తం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో శుక్రవారం రాత్రి 9.30 ప్రాంతంలో.. ఎవ్వరూలేని సమయంలో వచ్చిన సిట్ అధికారులు నోటీసులను గోడకు అంటించి వెళ్లారు. 160 సీఆర్పీసీ కిందనే నోటీసులు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని కోరారు. కాగా ప్రస్తుత తన అధికారిక నివాసం ఎర్రవల్లిలో ఉన్నదని, అక్కడే తనను విచారించాలని గురువారం రాత్రి కేసీఆర్ ఇచ్చిన సమాధానంపై తాజాగా ఇచ్చిన నోటీసుల్లో సిట్ అధికారులు పలు అంశాలను ప్రస్తావించారు.
‘మీరు 29న సమర్పించిన రిప్లయ్‌లో.. సిద్దిపేట జిల్లా మరూక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని మీ ప్రస్తుత నివాసంలో మిమ్మల్ని విచారించాలని కోరారు. ఎలక్షన్ అఫిడవిట్, రాష్ట్ర శాసనసభ రికార్డులు సహా అధికారిక రికార్డుల ప్రకారం మీ నివాసం నందినగర్ అని ఉన్నది.
పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్ 243/2024 కేసు దర్యాప్తునకు సంబంధించిన 160 సీఆర్పీసీ కింద నోటీసు జారీచేశాం. మేము గతంలో ఇచ్చిన నోటీసులను ఆ చిరునామాలోనే మొదట స్వీకరించారు. దానిని అందుకున్న తర్వాతే మీరు సమాధానం పంపించారు. సెక్షన్ 160 సీఆర్పీసీ నిబంధనల ప్రకారం, కేసు వివరాలు తెలిసిన వ్యక్తులు సంబంధిత పోలీస్‌స్టేషన్ పరిధిలోనే విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. దాని ప్రకారం, నోటీసులు మీ హైదరాబాద్ నివాసంలో అందజేశాం.. మీరు దానికి సమాధానం కూడా ఇచ్చారు. అయినప్పటికీ, మీ వయసును పరిగణనలోకి తీసుకుని, సెక్షన్ 160 సీఆర్పీసీలోని మినహాయింపును దృష్టిలో ఉంచుకుని, రికార్డుల ప్రకారం ఉన్న మీ నివాస చిరునామాలోనే విచారణ జరుపుతామని మేము తెలిపాం.
దర్యాప్తు ప్రయోజనాలను, మీ వయస్సును దృష్టిలో ఉంచుకొని, చట్టపరమైన నిబంధనల ప్రకారం అధికారిక రికార్డులలో ఉన్న మీ నివాసంలోనే విచారణ చేస్తామని దర్యాప్తు సంస్థ స్వచ్ఛందంగా తెలియజేస్తున్నది. మా వద్ద ఉన్న అధికారిక రికార్డులలో లేని నివాసంలో విచారణ జరపాలని మీరు చేసిన అభ్యర్థనను అంగీకరించలేం. ఎందుకంటే విచారణా స్థలం అనేది అధికారిక రికార్డుల్లో చూపించిన వాటి ఆధారంగా నిర్ణయించబడుతుంది. అంతేకాకుండా, ఈ విచారణలో అత్యంత సున్నితమైన అనేక ఎలక్ట్రానిక్, భౌతిక రికార్డులను పరిశీలించవలసి ఉంటుంది. వాటిని ఎర్రవల్లి గ్రామానికి తరలించలేము. కాబట్టి మీరు ఫిబ్రవరి ఒకటోతేదీన మధ్యాహ్నం 3 గంటలకు విచారణ నిమిత్తం హైదరాబాద్‌లోని మీ నివాసంలో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి’ అంటూ విచారణాధికారి పీ వెంకటగిరి నోటీసుల్లో పేర్కొన్నారు.
