KCR : ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే పరంపరను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉన్నది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు, పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావుకు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌రావుకు సిట్ నోటీసులు ఇచ్చి విచారణ జరిపింది. ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇచ్చింది.
కేసీఆర్ ప్రస్తుతం ఫామ్‌హౌజ్‌లో ఉండటంతో ఇవాళ (గురువారం) ఉదయం సిట్ అధికారులు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌కు వెళ్లి నోటీసులు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే వారు ఫామ్‌హౌజ్‌కు బదులుగా బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. ఆయన కుటుంబసభ్యులకు నోటీసులు అందజేశారు. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు (శుక్రవారం) విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులలో కోరారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులు కేసీఆర్‌ను విచారించనున్నారు. విచారణకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వయసురీత్యా విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని, మీరు కోరిన చోటే విచారిస్తామని కేసీఆర్‌కు తెలిపారు.