
విద్యానగర్, ఆగస్టు 21: వారిద్దరూ కవల అక్కాచెల్లెళ్లు. చిన్ననాటి నుంచి ఒకే తరహాలో పెరిగిన వారిద్దరు.. వివాహాలయ్యాక కవల పిల్లలకు జన్మనిచ్చారు. మూడు నెలల కింద చెల్లె ముగ్గురికి (ట్రిపులెట్స్), శనివారం అక్క నలుగురు శిశువుల (క్వాడ్రుప్లెట్స్)కు జన్మనిచ్చిన అరుదైన ఘటన కరీంనగర్లో చోటుచేసుకున్నది. కవలలైన తమ బిడ్డలు మళ్లీ కవలలకు జన్మనివ్వడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్‌కు చెందిన పబ్బ శ్రీలత, శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు కవల ఆడ పిల్లలు జన్మించారు. పెద్ద పాపకు నిఖిత, చిన్న పాపకు లిఖిత అని పేర్లు పెట్టారు. నిఖితను కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగులమల్యాలకు చెందిన సాయికిరణ్‌కు, లిఖితను రామడుగు మండలం వెలిచాలకు చెందిన రాకేశ్‌కు ఇచ్చి వివాహం చేశారు. మూడు నెలల కిందట కరీంనగర్‌లోని యశోదకృష్ణ దవాఖానలో లిఖిత ఒకే కాన్పులో ఇద్దరు మగ, ఒక ఆడ పిల్లకు జన్మనిచ్చింది. తాజాగా, శనివారం నిఖిత కూడా అదే దవాఖానలో ఇద్దరు మగ, ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. ఇద్దరి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్టు డాక్టర్ ఆకుల శైలజ తెలిపారు. ఏడెనిమిది లక్షల్లో ఒకరిద్దరికి జన్యు ప్రభావంతో ఇలాంటి అరుదైన జననాలు జరుగుతాయని చెప్పారు. తమ ఇద్దరు కవల పిల్లల్లో ఒకరికి ముగ్గురు, మరొకరికి నలుగురు పిల్లలు జన్మించడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.