Bollywood Hero | సోషల్ మీడియా విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు కూడా ప్రజల కళ్లముందు నిలుస్తున్నాయి. ఒక ఫోటో లేదా స్టోరీ పోస్ట్ చేయగానే, ఆ సెలబ్రిటీ ఎక్కడ ఉన్నారు, ఎవరితో ఉన్నారు, ఎందుకు వెళ్లారు అన్న దాకా నెట్టింట విశ్లేషణలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తాజాగా సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు కేంద్రబిందువుగా మారారు. వెకేషన్ కోసం గోవాకు వెళ్లిన కార్తీక్, అక్కడ బీచ్, వాలీబాల్ కోర్టు, విలాసవంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్లు ఓ స్టోరీ షేర్ చేయగా, అదే తరహా ఫోటోను 18 ఏళ్ల కరీనా కబిలియుటే అనే యువతి తన ప్రొఫైల్‌లో పోస్ట్ చేయడం చర్చకు దారి తీసింది. రెండు పోస్టుల్లో లొకేషన్, బ్యాక్‌గ్రౌండ్, వైబ్ చాలా దగ్గరగా ఉండటంతో ఇద్దరూ ఒకే చోట ఉన్నారన్న అనుమానాలు మొదలయ్యాయి.
దీంతో 35 ఏళ్ల కార్తీక్, 18 ఏళ్ల కరీనాల మధ్య రిలేషన్ ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు ఊపందుకున్నాయి. వయస్సు తేడా కారణంగా ఈ విషయం మరింత వివాదాస్పదంగా మారి, కార్తీక్‌పై ఉమెనైజర్ అంటూ ట్రోలింగ్ కామెంట్స్ వెల్లువెత్తాయి. అయితే మరోవైపు కొందరు మీడియా వర్గాలు, అభిమానులు మాత్రం కార్తీక్‌కు మద్దతుగా నిలుస్తూ, అతడి పెరుగుతున్న క్రేజ్‌ను తట్టుకోలేని నెపో క్లబ్ నుంచి కావాలనే ఇలాంటి నెగెటివ్ ప్రచారం జరుగుతోందని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఈ వాదనలకు ప్రత్యుత్తరంగా మరికొందరు నెటిజన్లు, నెపో కిడ్ అయిన అర్జున్ కపూర్ పెద్దవయసు మలైకా అరోరాతో డేటింగ్ చేసినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయని గుర్తు చేస్తూ, సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను పుకార్లుగా మార్చడం కొత్తేమీ కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే 18 ఏళ్ల కరీనాతో పేరు ముడిపడటంతో కార్తీక్‌ను ట్రోల్ చేయగా, ఎట్టకేలకి ఆమె స్పందించింది. తాను కార్తీక్ గర్ల్‌ఫ్రెండ్ కాదని తన ఇన్‌స్టా బయోలో పేర్కొంది . “నాకు కార్తీక్ తెలియదు. నేను అతని గర్ల్‌ఫ్రెండ్ కాదు. ఫ్యామిలీ వెకేషన్లో ఉన్నాను” అని రాసింది. మొత్తానికి ఒక వెకేషన్ ఫోటోతో మొదలైన వ్యవహారం, కార్తీక్ ఆర్యన్ వ్యక్తిగత జీవితంపై పెద్ద చర్చగా మారి, సోషల్ మీడియా సంస్కృతి సెలబ్రిటీలకు ఎంతటి ఒత్తిడిని తెస్తుందో మరోసారి చాటిచెప్పింది.