Toxic Teaser | రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న భారీ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ టీజర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. యశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టీజర్‌లోని ఒక ఇంటిమేట్ సీన్ ఇప్పుడు సినిమాకన్నా పెద్ద వివాదంగా మారింది. యాక్షన్, గ్యాంగ్‌స్టర్ షేడ్స్‌తో రూపొందిన టీజర్లో హీరో లుక్ ఆకట్టుకున్నప్పటికీ, ఒక బోల్డ్ విజువల్ మాత్రం నెటిజన్ల దృష్టిని పూర్తిగా ఆకర్షించింది. టీజర్లో బయట కాల్పుల శబ్దాలు వినిపిస్తుండగా, కారులో యశ్ పాత్ర ఒక యువతితో సన్నిహితంగా ఉన్నట్లు చూపించిన సన్నివేశం కొందరికి అభ్యంతరకరంగా అనిపించగా, మరికొందరు దాన్ని కథన శైలిలో భాగంగా చూస్తున్నారు.
ఈ సీన్‌పై విమర్శలు చెలరేగడంతో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ చివరకు స్పందించారు. అయితే ఆమె స్పందన సాధారణంగా కాకుండా వ్యంగ్య ధోరణిలో ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఆమె స్పందిస్తూ, సమాజం ఇప్పటికీ మహిళల ఆనందం, వారి సమ్మతి, స్వేచ్ఛ వంటి అంశాలపై చర్చల దశలోనే ఉందని వ్యాఖ్యానించారు. ఈ చర్చలన్నింటి మధ్య తాను మాత్రం ప్రశాంతంగా ఉన్నానని పేర్కొనడం ద్వారా విమర్శలకు పరోక్షంగా సమాధానం ఇచ్చారు. ఆ సీన్‌ను కేవలం శృంగార దృశ్యంగా కాకుండా, మహిళల అనుభవాలు, వారి ఎంపికలను ప్రతిబింబించే కోణంలో చూడాలని ఆమె సంకేతాలిచ్చినట్టుగా భావిస్తున్నారు.
ఈ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బహిరంగంగా ప్రశంసలు కురిపించగా, సోషల్ మీడియాలో మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు గతంలో మహిళల చిత్రణపై గట్టిగా మాట్లాడిన గీతూ ఇప్పుడు తన సినిమాల్లో అదే తరహా సన్నివేశాలను చూపించడం ద్వంద్వ వైఖరిగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు, ఇది పెద్దల కోసం రూపొందిస్తున్న సినిమా అని, దర్శకురాలి సృజనాత్మక స్వేచ్ఛను అర్థం చేసుకోవాలని ఆమెకు మద్దతుగా నిలిచేవారూ ఉన్నారు. యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా ఈ అంశంపై వేడి వాదనలు సాగుతున్నాయి. ఒక వర్గం మాత్రం ఇలాంటి సన్నివేశాలను వేర్వేరు ఇండస్ట్రీల్లో వేర్వేరు రీతుల్లో చూడటం సరికాదని ప్రశ్నిస్తోంది. సందర్భం, కథనం ఆధారంగా సినిమాను అర్థం చేసుకోవాలని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక ‘టాక్సిక్’ సినిమా విషయానికి వస్తే, ఇది ఒక స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యశ్ సరసన నయనతార, హుమా ఖురేషి, కియారా అద్వానీ, తారా సుతారియా వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.