MLA Palwai Harish | హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల్లోనే రూ.38 వేల కోట్ల అప్పులు చేసిందని, దీనిని బట్టి రాష్ట్రం దివాలా తీసిందని అర్థమవుతున్నదని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ పేర్కొన్నారు. దివాలా తీసిన రాష్ర్టాన్ని దివాలాకోరు సీఎం పాలిస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బ్లీచింగ్ పౌడర్ కొనడానికీ గ్రామ పంచాయతీలో డబ్బులు లేవని వార్తలు వస్తున్నాయని తెలిపారు. పల్లెల్లో పాలన పడకేసిందని, చికెన్ గున్యా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలులో సీఎం తీరిక లేకుండా ఉన్నారని మండిపడ్డారు. కేకే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పాతివ్రత్యాన్ని నిరూపించుకున్నారు. మరి మిగతావారి సంగతేంటి?’ అని నిలదీశారు. ఇక, ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియదన్నట్టుగా మంత్రులు హుండీలు పెట్టుకొని మరీ సంపాదన మొదలెట్టారని ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో కలెక్టర్లు, మంత్రులు పెత్తనం చెలాయిస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీ జెండాలు కడుతున్నారని ధ్వజమెత్తారు. వీటన్నింటిపై అసెంబ్లీలో సీఎంను ఎండగడుతామని వెల్లడించారు.