హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): గత ఏడు నెలల్లో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు విమర్శించారు. వీటిపై కనీసం సమీక్ష చేసే సమయం కూడా ముఖ్యమంత్రికి లేదని మండిపడ్డారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కోసం ఢిల్లీకి డబ్బులు పంపించే పనిలో ముఖ్యమంత్రి ఉంటే, మంత్రులు వారి సంపాదనలో మునిగిపోయారని ఆరోపించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో రెండు రోజుల క్రితం జరిగిన దారుణ ఘటన కాంగ్రెస్ నేతలకు చెంప పెట్టులాంటిదని దుయ్యబట్టారు.
ఆరేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి హత్య చేయడం సభ్య సమాజానికి తలవంపులు తెచ్చే ఘటన అని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ఇల్లు, రూ.20 లక్షల పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏడు నెలల్లో పంచాయతీలకు ఒక రూపాయి కూడా కేటాయించలేదని, కొత్త ప్రభుత్వం వచ్చాక ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లకు జీతాలు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తంచేశారు. సమస్యలు పరిషరించలేని రాష్ట్ర ప్రభుత్వం చెంపలేసుకుని తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లో ఇంటి తగాదా వల్ల క్యాబినెట్ విస్తరణ చేపట్టడం లేదని, కనీసం హోంమంత్రి, విద్యాశాఖ మంత్రిని కూడా నియమించడం లేదని దుయ్యబట్టారు.