హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): గద్దెనెక్కిన తర్వాత 48 సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏం సాధించారో, ఎన్ని నిధులు తెచ్చారో వెంటనే శ్వేతపత్రం విడుదలచేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. 20 నెలల్లో పాలనను గాలికొదిలి విమానాల్లో తిరగడం, గాలి మాటలు మాట్లాడటం తప్ప సీఎం రేవంత్ ఉద్ధరించిందేమీలేదని విమర్శించారు. శుక్రవారం ఆయ న తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి తన కుర్చీని కాపాడుకొనేందుకు రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీ పెద్దలకు తాకట్టుపెడుతున్నారని ఆరోపించారు. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచర్లపై చంద్రబాబుతో చర్చల విషయంలో ఆయన బాగోతం బట్టబయలైందని, పచ్చి అబద్ధాలు చెప్పి అడ్డంగా బుక్కయ్యారని విమర్శించారు.
600 రోజుల పాలనలో 200 రోజులు ఢిల్లీతోపాటు దావోస్, కొరియా, జపాన్, లండన్, దక్షిణ అమెరికా పర్యటనల్లోనే కాలం వెళ్లదీశారని దుయ్యబట్టారు. సెక్రటేరియట్‌కు వెళ్లకుండా తన ఇల్లు లేదా కంట్రోల్ కమాండ్ సెంటర్ నుంచే పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఏడాదిన్నరలో మహిళలు మొదలుకొని అన్నదాతల దాకా అందరినీ మోసం చేసిన వ్యక్తిగా రేవంత్ చరిత్రహీనుడిగా మిగిలిపోయారని దుయ్యబట్టారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగుచూస్తున్నా విద్యాశాఖను అట్టిపెట్టుకున్న సీఎంమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు.
42% కోటాకు ధోకా
బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా బలహీనవర్గాలను ధోకా చేస్తున్నారని, బిల్లులు, చట్టం, ఆర్డినెన్స్ పేరిట డ్రామాలు ఆడుతూ ఏమారుస్తున్నారని మధుసూదనాచారి దుయ్యబట్టారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఆర్డినెన్స్‌ను పక్కనబెట్టి, నాటకాలను కట్టిపెట్టి బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని, రాష్ట్రపతిని ఒప్పించి రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించాలని కోరారు. బడ్జెట్లో బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని కోతలు కోసిన రేవంత్‌రెడ్డి ఏడాదిన్నరలో కేవలం రూ.7 వేల కోట్లు కేటాయించి 10 శాతమే ఖర్చు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. మళ్లీ స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం కొత్త నాటకానికి తెరలేపుతున్నారని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ దుర్మార్గాలకు ఓటుతో బదులివ్వాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యం అపహాస్యం
సీఎం రేవంత్‌రెడ్డి పోలీస్స్టేషన్లను కాంగ్రెస్ కార్యాలయాలుగా మార్చి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని మధుసూదనాచారి విమర్శించారు. ప్రశ్నించిన బీఆర్ఎస్ సోషల్‌మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతునొక్కుతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ కోటా ఇవ్వాలనేది బీఆర్ఎస్ విధానమని, ఆర్డినెన్స్‌ను సమర్థించిన వారి మాటలను వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నామని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. పార్టీకి ఎవరూ అతీతులు కాదని, అన్నీ గమనించే తగిన సమయంలో స్పందిస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, నవీన్‌కుమార్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆంజనేయులుగౌడ్ పాల్గొన్నారు.