హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : 60 ఏండ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది విద్యార్థుల బలిదానాల సాక్షిగా, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడం బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అవివేకానికి పరాకాష్ట అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు రాష్ట్ర విభజనతో సంబంధం లేని చర్చలో పదేపదే తెలంగాణ అంశం తీయడం వెనుక మోదీ ఎజెండా ఏమై ఉంటుంది? తన దోస్త్ చంద్రబాబు కోసం తెలంగాణ మనోభావాలను కించపరుస్తారా? అని ప్రశ్నించారు.
లోక్‌సభలో బీఆర్ఎస్ బలమైన స్వరం లేకపోవడం వల్లే ఇతర రాష్ట్రాల నాయకులు తెలంగాణ రాష్ట్రంపై విషం కకుతున్నారని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రం నుంచి 16 మంది బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నప్పటికీ, తేజస్వీ సూర్య మాట్లాడుతుంటే కనీసం అడ్డుకోలేక పోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. తేజస్వీ సూర్య వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఏర్పాటు తీరును బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య దేశ విభజనతో పోల్చడంపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రవిచంద్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. తేజస్వీ సూర్య వ్యాఖ్యలు అసంబద్ధమైనవిగా పేర్కొని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు అహింసామార్గంలో ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం యావత్ ప్రపంచానికి తెలిసిందేనని గుర్తుచేశారు. ఈ వాస్తవాన్ని మర్చిపోయి ఎంపీ తేజస్వీ దేశ విభజనతో పోల్చడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆయన తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ధ్వజమెత్తారు.

తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం, అవివేకపూరితమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. తేజస్వీ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధంగా, పార్లమెంట్ ప్రక్రియ ద్వారా ఒక రాష్ట్రం ఏర్పడటాన్ని దేశ విభజనతో ముడిపెట్టి శత్రుదేశమైన పాకిస్థాన్‌తో పోల్చడం క్షమించరాని నేరమని ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వేలాదిమంది అమరుల త్యాగాలను అవమానించేలా బీజేపీ ఎంపీ తేజస్వీ వ్యాఖ్యలు ఉన్నాయని వేముల మండిపడ్డారు. ‘బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేసిన ఎంపీపై వెంటనే చర్యలు తీసుకోవాలి. పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడమంటే పార్లమెంట్‌ను, 140 కోట్ల దేశ ప్రజలను అవమానించడమేనని ధ్వజమెత్తారు. ఇది క్షమించరాని నేరమని పేర్కొన్నారు.

పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్‌తో పోల్చడం రాష్ట్ర ప్రజలందరినీ అవమానించడం, అగౌరవపరచడమేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. ఇలా మాట్లాడిన ఎంపీ సూర్య వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. అనేక మంది త్యాగం, పోరాటంతో తెలంగాణను సాధించుకున్నామని, ఎవరి దయతోనో తెలంగాణ ఏర్పడలేదని తెలిపారు. ఎంపీ సూర్య మాటలను ఖండించకుండా కూర్చున్న తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల తీరు సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తోపాటు ఇతర ఆరుగురు ఎంపీలు సూర్య వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఏర్పాటును బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం సిగ్గుచేటని మాజీ ఎంపీ నామ నాగేశ్వర్రావు ఖండించారు. ఆయన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి అవమానమని గురువారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ద్వేషపూరిత వైఖరి దేశ ఐక్యతకు విఘాతాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణను అవమానిస్తుంటే ప్రతిఘటించాల్సిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనం వహించడం దురదృష్టకరమన్నారు.

బీజేపీ ఎంపీ తేజస్వీ వ్యాఖ్యలు తెలంగాణ అమరులను అవమానించేలా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా గతంలో తల్లీ బిడ్డను వేరు చేశారని రాష్ట్ర విభజనపై మాట్లాడిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకున్నారని తెలిపారు. బీజేపీ ఎంపీలు తెలంగాణపై ద్వేషం పెంచుకున్నట్టు ఇలాంటి సందర్భాల ద్వారా అర్థమవుతున్నదని పేర్కొన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు బీజేపీ అసలు రంగు తెలుసుకోవాలని సూచించారు.

పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడటం అహంకారపూరితమని టీజీఐఐసీ మాజీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు ధ్వజమెత్తారు. ఆయన వ్యాఖ్యలతో బీజేపీ తెలంగాణ వ్యతిరేకి అనే విషయం మరోసారి రుజువైందని మండిపడ్డారు. గతంలో ప్రధాని మోదీ తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అసహాస్యం చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం అదేబాటలో తేజస్వీ విషం కక్కారని దుయ్యబట్టారు. బీజేపీ వెంటనే తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆ పార్టీని తెలంగాణ ప్రజలు బొందపెట్టడం ఖాయమని హెచ్చరించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ): తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యల వెనుక ఏపీ సీఎం చంద్రబాబు హస్తం ఉన్నదని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజుయాదవ్ ఒక ప్రకటనలో ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్, పాకిస్థాన్‌తో పోల్చడం దేశ ద్రోహం లాంటిదని బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్‌గౌడ్ ఘాటుగా స్పందించారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత కిశోర్‌గౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, గజ్జెల నాగేశ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్, ఓయూ నేత శ్రీకాంత్ ముదిరాజ్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్ ఆవిర్భావంతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు ఆయన వికృత మనస్తత్వానికి, తెలంగాణపై ఉన్న ద్వేషానికి పరాకాష్ట అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. వందలాది మంది బలిదానాలు, దశాబ్దాల పోరాట ఫలితంగా సిద్ధించిన తెలంగాణను ఒక శత్రుదేశంతో పోల్చడమంటే, నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల గుండెలపై తన్నడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ అంటే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం సాగిన ఒక పవిత్రమైన ప్రజాస్వామ్య ఉద్యమం అని, అస్తిత్వం కోసం ప్రజలు చేసిన పోరాటాన్ని పాకిస్థాన్‌తో పోల్చడానికి నీకు ఎంత ధైర్యం? అని సూర్యపై మండిపడ్డారు.

తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని, ఆయనపై బీఎన్ఎస్ఎస్ కింద కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నో ఏండ్ల పోరాటం, ఎందరో త్యాగఫలితంగా ఏర్పడిన రాష్ర్టాన్ని శత్రుదేశమైన పాకిస్థాన్‌తో పోల్చడం క్షమించరాని నేరమని ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలపై ఎంపీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం తెలంగాణ చరిత్రను వక్రీకరించడం బీజేపీకి అలవాటుగా మారింది ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన 16 మంది ఎంపీలు ఈ విషయంపై మౌనంగా ఉండడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.