సిర్గాపూర్, జనవరి 3 : సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్ కిషన్ అసభ్య పదజాలంతో విద్యార్థులను తిట్టిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వార్డెన్ కిషన్ తీరుపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
‘నాపైనే విద్యార్థులు అధికారులకు షికాయత్ చేస్తారా.. వారికి ఎంత ధైర్యం’ అంటూ రాత్రివేళ ఆగ్రహంతో వార్డెన్ కిషన్ హాస్టల్ సిబ్బందికి ఫోన్ చేసి హల్చల్ చేశారు. మద్యం తాగిన మైకంలో విచక్షణ మరిచి.. ‘ఫిర్యాదు చేసిన వాళ్ల అన్నంలో విషం కలిపి చంపెయ్యండి’ అంటూ సిబ్బందికి హుకుం జారీచేశాడు. ఈ ఆడియో వైరల్ అవ్వగా, సంగారెడ్డి కలెక్టర్ ప్రవీణ స్పందించి శుక్రవారం వార్డెన్‌ను సస్పెండ్ చేశారు.
సిర్గాపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో కరెంటు, మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, నాణ్యత లేని ఆహారం, అరకొర వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలపై విసుగు చెందిన విద్యార్థులు గురువారం రాత్రి హాస్టల్ వద్ద రోడ్డెక్కి ధర్నా చేశారు. దీంతో సిర్గాపూర్ సర్పంచ్ శ్రీనివాస్‌రావు, ఎస్సై మహేశ్ వెళ్లి విద్యార్థులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు.
శుక్రవారం హాస్టల్‌కు వచ్చిన వార్డెన్ కిషన్.. పిల్లలను బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. అన్నంలో విషం కలిపి చంపేయండని హాస్టల్ సిబ్బందిని ఆదేశించాడు. అదే సమయంలో నారాయణఖేడ్ మున్సిప్ కోర్టు జడ్జి మంథని శ్రీధర్ హాస్టల్‌ను సందర్శించి విచారణ జరిపారు. వార్డెన్ ఫోన్ సంభాషణ , విద్యార్థుల ఆరోపణలపై జడ్జి కూడాఆరాతీసి వార్డెన్‌పై మండిపడ్డారు. వార్డెన్ తీరుపై ఉన్నతాధికారులకు జడ్జి నివేదించారు. తహసీల్దార్, ఎంఈవోలు కూడా విచారించగా ఇదే ఫిర్యాదులు రావడంతో కలెక్టర్‌కు నివేదించారు. దీంతో కలెక్టర్ హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేశారు.