Sircilla | రాజన్న సిరిసిల్ల, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : వస్త్ర పరిశ్రమకు చేయూతనిస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు మాటలు నీటి మూటలే అయ్యాయి. సబ్సిడీపై నూలు అందిస్తామని ఎన్నో గొప్పలు చెప్పి వేములవాడలో ఏర్పాటు చేసిన యారన్ బ్యాంకులో నూలు నిల్వలు మృగ్యమయ్యాయి. దీంతో నూలు అందక వస్త్రపరిశ్రమ మూతపడే దశకుచేరి వందలాది మంది కార్మికులు రోడ్డున పడే దుస్థితి వచ్చింది. డీడీలు కట్టి దాదాపు నెల అవుతున్నా నూలు రాక వస్త్ర ఉత్పత్తి నిలిచిపోయి కార్మికుల ఉపాధిపై దెబ్బపడింది. దాదాపు పదివేల మరమగ్గాలు బందయ్యి, వందలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. సిరిసిల్ల నేతన్నలను ఆదుకునేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం కోటి బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి వారి బతుకులకు భరోసా కల్పిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలను బంద్ చేసి వారి పొట్టకొట్టింది. మెరుగైన ఆర్డర్లు ఇస్తామని చెప్పి 65 లక్షల మీటర్ల ఆర్వీఎం యూనిఫాంల తయారీ ఆర్డర్లు కంటితుడుపుగా ఇచ్చి చేతులు దులుపుకొన్నది.
మూతపడ్డ సాంచాలు..
వస్త్ర ఉత్పత్తులకు వినియోగించే నూలును సబ్సిడీపై అందించి పరిశ్రమకు చేయూత నిస్తామని చెప్పిన ప్రభుత్వం వేములవాడ మార్కెట్ యార్డులో యారన్ బ్యాంకును ప్రారంభించింది. వందకు పది శాతం డబ్బులు చెల్లిస్తే సరిపడా నూలు సరఫరా చేస్తామని ప్రకటించింది. నూలు సరఫరా బాధ్యతను టెస్కోకు అప్పగించింది. సిరిసిల్లలో 128 మాక్స్ సంఘాలున్నాయి. ఒక్కో సంఘంలో 10 నుంచి 12 మంది ఆసాములున్నారు. ఒక్కో సంఘానికి దాదాపు 150 సాంచాల వరకు ఉండగా, మొత్తం 20,400 సాంచాలకు ప్రభుత్వం 65 లక్షల ఆర్వీఎం యూనిఫాంల తయారీ ఆర్డర్లు ఇచ్చింది. ఒక్కో సంఘానికి 51,100 మీటర్ల వస్త్ర తయారీ ఆర్డర్లను టెస్కో ద్వారా ఇచ్చింది. ఈ ఆర్డర్లకు సుమారు 104 టన్నుల నూలు అవసరం కాగా, యారన్ బ్యాంకు ద్వారా సరఫరా చేయాల్సి ఉన్నది. ఒక్కో మాక్స్ సంఘం నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు నూలు కోసం నెల కిందే డీడీలు చెల్లించారు. నూలు ఏదని ప్రశ్నిస్తే ‘రేపు, మాపు’ అంటూ అధికారులు దాటవేస్తున్నారని, సాంచాలు బంద్ పడడంతో పూట గడవక ఇబ్బంది పడుతున్నామని ఆసాములు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టన్నుల కొద్దీ నూలు అవసరం ఉన్నా, తక్కువ పరిణామంలో తెప్పించి కొన్ని మాక్స్ సంఘాలకు మాత్రమే సరఫరా చేశారు. 128 సంఘాలుంటే కేవలం 20 సంఘాలకే సరఫరా చేసినట్టు సంఘ సభ్యులు తెలిపారు.
ఒకే మిల్లుకు ఆర్డర్లు
నూలు తెప్పించడంలో అధికారులు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నూలు తయారు చేసే స్పిన్నింగ్ మిల్లులు దేశంలో వందల సంఖ్యలో ఉన్నా ఒకే మిల్లు నుంచి తెప్పించడంలో అంతర్యమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వస్త్ర పరిశ్రమకు సరిపడా వివిధ మిల్లుల నుంచి యజమానులు గతంలో కొనుగోలు చేసి తెప్పించుకునే వారు. గుజరాత్, తమిళనాడు, కర్నాటక రాష్ర్టాల నుంచి నూలు సిరిసిల్లకు వస్తుండేది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూలు బ్యాంకుకు ఒకే మిల్లుతో ఒప్పందం చేసుకోవడంతో డిమాండ్ మేరకు సరైన సమయంలో సరఫరా కాక, సాంచాలు బంద్ పడుతున్నాయని ఆసాములు, కార్మికులు చెప్తున్నారు.
డీడీలు కట్టి న్లైంది
ఇచ్చిన ఆర్డర్లకు సంబంధించి నూలు కోసం రూ.3 లక్షల డీడీలు కట్టి నెలరోజులైంది. అదిగో ఇదిగో అని అధికారులు చెప్తున్నారే కానీ ఎప్పుడు వస్తుందో చెప్తలేరు. అన్ని రకాల నూలు నిల్వలు అందుబాటులో ఉంటాయని చెప్పి ఇప్పుడు అడిగితే సరైన సమాధానం ఇస్తలేరు. మా సంఘంలో పది మంది ఆసాములున్నారు. నూలు అందక 120 సంచాలు పూర్తిగా మూతపడ్డయి. పనిలేక కార్మికులు పస్తులుంటున్నరు. నూలు బ్యాంకులో నిల్వలు పెంచి వెంటనే సరఫరా చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలి. యారన్కు ఇచ్చిన సబ్సిడీ వడ్డీలకే సరిపోతున్నది.
– కోడం శంకర్, ఆసామి
టెస్కో స్పందించాలి
కార్మికులకు చేతి నిం డా పని కల్పించి, వస్త్ర పరిశ్రమకు చేయూత నిచ్చేందుకు ప్రభుత్వం నూలు బ్యాంకు ఏర్పాటు చేసింది. అధికారుల నిర్లక్ష్యంతో సరఫరా కావడం లేదు. డీడీలు కట్టి నెలవుతున్నా నూలు అందక సాంచాలు నడవక, కార్మికులు ఉపాధి కోల్పోతున్నా రు. టెస్కో అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. బ్యాంకులో సరిపడా నూలు అందుబాటులో ఉంచాలి. నెల రోజులవుతున్నా సరఫరా చెయ్యకుంటే ఇచ్చే సబ్సిడీ వడ్డీలకే సరిపోతుంది. ఆసాములు నష్టపోతారు.
– పంతం రవి, చేనేత,వపర్లూం కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి