రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) సిరిసిల్ల హైకోర్టులో దాఖలు చేసిన కేసు మళ్లీ వాయిదా పడింది. సిరిసిల్ల సెస్ 56 ఏండ్లుగా సేవలందిస్తున్నదని, 2025 డిసెంబర్లోనే తాము తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలికి లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నామని, 31 మార్చి 2026లోపు రెన్యువల్ చేయాల్సి ఉన్నా చేయలేదని, తమకు ఎలాంటి సమాచారం, నోటీసులు ఇవ్వకుండా ఏప్రిల్ 1న సెస్‌ను టీజీఎన్పీడీసీఎల్, టీజీ ఈఆర్సీ అధికార బృందాలు ఆధీనంలోకి తీసుకున్నాయని ఈ నెల 7న సెస్ పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో కేసు విచారణ సందర్భంగా జస్టిస్ రేణుక ఎదుట సెస్ పాలకవర్గం తరపున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్‌రావు, అడ్వకేట్ వాదనలు వినిపించారు. టీజీఈఆర్ఎసీ, టీజీఎన్పీడీసీఎల్, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు బుధవారం కౌంటర్ దాఖ లు చేయడంతో జస్టిస్ రేణుక ఈ కేసును ఈ నెల 20కు వాయిదా వేశారు. దీంతో సెస్‌పై మరింత ఉత్కంఠ నెలకొన్నది.కోర్టు తీర్పు సెస్‌కు అనుకూలంగా వస్తుందా? వ్యతిరేకంగా వస్తుందా? అని వినియోగదారులు ఆందోళనలో ఉన్నారు.
సిరిసిల్ల సెస్‌ను ఏప్రిల్ 1న ఆధీనంలోకి తీసుకున్న టీజీఎన్పీడీసీఎల్ దూకుడు పెంచింది. టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. మొదటి రోజే భారీ బందోబస్తు మధ్య సెస్ అధికారులతో సమీక్షించారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల బృందానికి ఆదేశాలు జారీ చేశారు. సిరిసిల్ల, వేములవాడలో పర్యటించిన సీఎండీ, ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని పవర్లూమ్ యూనిట్లకు 25 హెచ్‌పీలోపు ఉన్నవారికి క్యాటగిరీ-4కు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధికారులను సైతం బదిలీ చేస్తూ అప్రమత్తం చేశారు. సుమారు రూ.45 కోట్ల విలువైన ట్రాన్స్ఫార్మర్లు, సామగ్రిని స్టోర్స్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల సెస్‌ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో కోర్టు తీర్పు కీలకం కానున్నది.