సిరిసిల్ల రూరల్, జూన్ 21: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాజ న్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులో నిర్మిస్తున్న వ్యవసాయ కళాశాల ప్రారంభానికి సిద్ధమైంది. 35 ఎకరాల విస్తీర్ణంలో 69.30 కోట్లతో ప్రభుత్వం ఈ కళాశాలను ఏర్పాటుచేసింది. 16 ఎకరాల్లో కళాశాల భవనం, బాలబాలికలకు వేర్వేరు హాస్టళ్లు, 19 ఎకరాల్లో వ్యవసాయ పరిశోధనా క్షేత్రం, ఫాంలాండ్స్ను నిర్మించింది. అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్లు, ప్రయోగశాల, సెమినార్ రూములు, అధ్యాపకుల గదులు, అసోసియేట్ డీన్ చాంబర్, ఆధునిక లైబ్రరీ ఏర్పాటుచేశారు. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు.