మెదక్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : ఎట్టకేలకు సింగూర్ ప్రాజెక్టు నుంచి మెదక్ జిల్లా ఘనపూర్ ఆనకట్టకు ప్రభుత్వం సాగు నీటిని విడుదల చేసింది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. సాగునీటిని విడుదల చేసి పంటలు కాపాడాలని ఈ నెల 7న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డితోపాటు రైతులతో కలిసి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్‌కు వినతిపత్రం అందజేశారు. అదీగాక బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సాగు నీటి సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించారు.
సింగూర్ నుంచి ఘనపూర్‌కు నీటిని విడుదల చేయాలని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ 7వ తేదీ సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డు కార్యదర్శితోపాటు సంగారెడ్డి కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. నీటిపారుదల శాఖ అధికారులు శనివారం సాయంత్రం సింగూరు నుంచి 0.03 టీఎంసీల నీటిని ఘనపూర్‌కు విడుదల చేశారు. ఈ నీటితో పంటలు గట్టెక్కనున్నాయి. సాగునీటిని విడుదల చేసేందుకు కృషిచేసిన బీఆర్ఎస్ నేతలకు రైతులు కృతజ్ఞ్ఞతలు తెలిపారు.
మెదక్ జిల్లాలో రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నది. ఘనపూర్‌కు నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు సాగుచేసిన వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయి. ఇటీవల రైతుల పక్షాన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌కు ఫిర్యాదు చేశాం. రైతుల సమస్యను విన్న చైర్మన్ వెంటనే స్పందించి నీటి విడుదలకు ఆదేశాలు జారీచేశారు. రైతులపక్షాన పోరాడి, వారి సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటాం.
– పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్