హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సింగిల్ పిక్ కాటన్ (ఒకే కాత పత్తి) సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే అమలు ప్రణాళికపై సీఎస్ సోమేశ్‌కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్ నుంచి సింగిల్ పిక్ కాటన్ సాగును ప్రారంభించనున్నట్టు తెలిపారు. తొలిదశలో 45 వేల ఎకరాల్లో సాగు చేయనున్నట్టు తెలిపారు. గతంలో ప్రయోగం చేసిన ప్రాంతాల్లో సాగు విస్తీర్ణాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఈ విధానాన్ని పలు దేశాల్లో రైతులు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ విధానం ద్వారా 40 శాతం అధిక దిగుబడి వస్తుందన్నారు.
ఈ నేపథ్యంలో సింగిల్ పిక్ కాటన్ సాగుపై ఎంపిక చేసిన రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా అధిక సాంద్రత పద్ధతిలో పత్తిసాగు (హై డెన్సిటీ) విధానాన్ని ప్రోత్సహించేందుకు విత్తన కంపెనీల సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేసి చర్చించాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. సింగిల్ పిక్, హైడెన్సిటీ పత్తి సాగు చేసే రైతుల వివరాలను సేకరించాలని చెప్పారు. రైతుల వివరాలు, వర్షపాతం, పంటల క్యాలెండర్ వివరాలతో కూడిన యాప్‌ను రూపొందించాలని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయం | single pic cotton | cotton forming | agriculture news | agri news | telugu news