హైదరాబాద్ సిటీబ్యూరో/ వ్యవసాయ యూనివర్సిటీ, జనవరి 16 (నమస్తే తెలంగాణ): కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ రిజిస్ట్రార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియల్లో అనుకూలమైన వారికి, ఆంధ్రా విద్యార్థులకు లబ్ధిచేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలకు విడుదల చేసిన నోటిఫికేషన్ ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు.
తప్పులతడకగా హడావుడి నోటిఫికేషన్
ఉద్యాన వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ (79), అసోసియేషన్ ప్రొఫెసర్ (44), ప్రొఫెసర్ (17) పోస్టుల భర్తీకి 2025 డిసెంబర్ 31న రిజిస్ట్రార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తుకు ఈ నెల 31ని చివరి తేదీగా పేర్కొన్నారు. నోటిఫికేషన్లో వర్సిటీ లోగో, రిజిస్ట్రార్ సంతకం లేకుండా, రిజర్వేషన్లను తికమకగా చూపుతూ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. విద్యార్థులు అభ్యంతరాలు చెప్పడంతో దాన్ని సవరిస్తూ 2న మరో నోటిఫికేషన్ విడుదల చేశారు. అందులోనూ రిజర్వేషన్లు తప్పుల తడకగానే ఉన్నాయి. వర్సిటీలో 11 బ్యాక్లాగ్ పోస్టులు ఉండగా, వాటికి ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వకుండా తాజా నోటిఫికేషన్లో కలిపినట్టు తెలుస్తున్నది.
కొత్తవాళ్లకు నష్టం జరిగేలా నిర్ణయాలు
థీసిస్ సమర్పించేందుకు మూడు నెలల గడువు మిలిగి ఉన్న సమయంలోనే రిజిస్ట్రార్ నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని పీహెచ్డీ విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రిజిస్ట్రార్ ఉద్దేశపూర్వకంగానే హడావుడిగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. పీహెచ్డీ విద్యార్థులకు గైడ్లుగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా రిజిస్ట్రార్ ధోరణి సరికాదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనుకూల అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్ పోస్టులు కట్టబెట్టేందుకే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. 15 శాతం కోటాలో ఏపీ విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా కుట్ర పన్నారని చెప్తున్నారు. ప్రస్తుత రిజిస్ట్రార్‌తో తమకు న్యాయం జరుగుదని తెలంగాణ విద్యార్థులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన చెందుతున్నారు.
నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్ : వీసీ
కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీ జరగక దాదాపు 8 ఏండ్లు అవుతున్నది. కొత్త ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు అవకాశం వచ్చింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్ విడుదల చేశాం. రిజిస్ట్రార్ తనకు ఇష్టం వచ్చినట్టు చేశారనడంలో నిజం లేదు. కొంతమంది అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన వారు కావాలని విమర్శలు చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల, తేదీల నిర్ణయం మొత్తం పకడ్బందీగానే జరుగుతున్నది. తొలుత నోటిఫికేషన్లో కొన్ని అక్షర దోషాలు దొర్లడంతో మళ్లీ రెండోది విడుదల చేశాం. కానీ ఎవరికీ అన్యాయం చేయాలనే ఉద్దేశం వైస్ ఛాన్స్‌లర్‌గా నాకు కానీ, రిజిస్ట్రార్‌కు కానీ లేదు.