హైదరాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని వర్సిటీల్లో అసిస్టెం ట్ ప్రొఫెసర్ల భర్తీకి ఒకే అప్లికేషన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఉన్నత విద్యామండలి ప్రయత్నిస్తున్నది. ఆన్లైన్ కామన్ అప్లికేషన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ఇటీవలే సర్కారు జీవో విడుదల చేసింది. పోస్టుల భర్తీని ఉమ్మడిగా కాకుండా ఏ యూనివర్సిటీ పోస్టులను ఆ యూనివర్సిటీయే భర్తీచేసుకునే అవకాశం ఇచ్చారు. దరఖాస్తుల స్వీకరణకు మాత్రం కామన్ అప్లికేషన్ విధానాన్ని అమలుచేయాలని యోచిస్తున్నారు. ఇందుకు ఉన్నత విద్యామండలి ఆన్లైన్ పోర్టల్‌ను తీసుకురానున్నది. అభ్యర్థులు ఈ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో తమకు కావాల్సిన యూనివర్సిటీలను ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంతో ఒకే అభ్యర్థి అన్ని వర్సిటీలకు దరఖాస్తు చేసే భారం తప్పుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి తెలిపారు.
గురుకులాల్లో కోడింగ్ కోర్సులు ; వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు
హైదరాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ) : వచ్చే విద్యాసంవత్సరం (2025-26) నుంచి గురుకులాల్లో కోడింగ్ కోర్సులు అమలు చేయనున్నట్టు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ(టీజీఎస్డబ్ల్యూఈఐఎస్)కార్యదర్శి వర్షిణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు 238 గురుకుల పాఠశాలల్లో కోడింగ్ కోర్సు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం ఐదేండ్ల కాలానికి ఆర్పీఎఫ్-యూకే ఫౌండేషన్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నట్టు తెలిపారు.