చర్లపల్లి, ఆక్టోబర్ 26 : ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన తమను రేవంత్‌రెడ్డి మోసం చేశారని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, ఏఎస్‌రావునగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష ఆరోపించారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ టీఎస్ఐఐసీ కాలనీలోని కాప్రా ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రేవంత్ కోసం ఎంతో కష్టపడిన తమకు ఉప్పల్ టికెట్ దక్కకుండా అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన చేతిలో మోసపోయిన బాధితులను ఏకం చేసి కొడంగల్‌లో రేవంత్‌ను ఓడించేందుకు కృషి చేస్తామని శపథం చేశారు. కాంగ్రెస్ సహా పలు సంస్థలు చేసిన సర్వేలు తమకు అనుకూలంగా ఉన్నా, ఓడిపోయే పరమేశ్వర్‌రెడ్డికి ఉప్పల్ టికెట్ కేటాయించారని విమర్శించారు. త్వరలోనే రేవంత్ బాధిత సంఘం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ గెలిచి రేవంత్ సీఎం అయితే రాష్ర్టాన్ని అమ్మేస్తాడని హెచ్చరించారు.
బీఆర్ఎస్లోకి సోమశేఖర్‌రెడ్డి, శిరీష
పేదల సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీలో త్వరలో చేరబోతున్నట్టు సోమశేఖర్‌రెడ్డి, శిరీష ప్రకటించారు.