హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ)/వనపర్తి టౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచున ఉన్నదని, ఇం దుకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి పనులను మెచ్చే ప్రజలు గులాబీ జెండాను హత్తుకున్నారన్నారు. గురువారం ఆయన వనపర్తి జిల్లా కేంద్రంలో నూతనంగా గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడు తూ అసమర్థ కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యంతోనే పంచాయతీలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. రేవంత్ పనితీరు బాగుంటే పార్టీరహిత ఎన్నికల్లో ప్రజలు గులాబీ జెండా, కేసీఆర్ బొమ్మను ఎందుకు ఆదరిస్తారన్నారు. అధికార పార్టీ అరాచకాలు, దౌర్జన్యాలు, ప్రలోభాలను ధిక్కరించి ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారని వ్యాఖ్యానించారు.