పెబ్బేరు, ఫిబ్రవరి 5: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో నాటి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. గురువారం వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు చరిత్ర సృష్టించాయని తెలిపారు.
రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కంటి వెలుగు, బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్లు, విద్యా భరోసా, 24 గంటల కరెంట్ తదితర పథకాలు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. పెబ్బేరు మున్సిపాలిటీలో కేసీఆర్ ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెట్టిందని చెప్పారు. నాడు మొదలు పెట్టిన అభివృద్ధి పనులు కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో ముందుకు సాగడం లేదని ఆవేదన చెందారు. రోడ్ల విస్తరణ అసంపూర్తిగా మిగిలిపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 6 గ్యారెంటీలను రేవంత్ సర్కార్ తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.