హైదరాబాద్,జూలై 6 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతలు ఎదురొంటున్న ఇబ్బందులపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు జరుగుతున్న అన్యాయం, వారి గోసలు కాంగ్రెస్ గుడ్డి సర్కార్‌కు కనిపిస్తలేవని ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పొలాల్లో మేడి పట్టాల్సిన రైతులు, కాంగ్రెస్ సర్కార్ పుణ్యాన చేతిలో సెల్ఫోన్లు పట్టుకోవాల్సిన దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. ‘యాప్ ద్వారా యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎరువుల బుకింగ్ కోసం రోజుల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. సరిగ్గా యూరియా సరఫరా చేయడం చేతగాక, యాప్ విధానాన్ని తీసుకొచ్చి ఏదో ఘనత సాధించినట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు’ అని విమర్శించారు.