హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవితకు బెయిల్ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని, ఆ రెండు పార్టీలది అనైతిక వాదన అని, రాజకీయం కోసం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులపై బురద జల్లుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.
ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో కవిత మీద మోపిన అభియోగాలకు ఎలాంటి నైతికత లేదని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేవలం రాజకీయ కక్షతో మోపిన కేసు ఇదని, జాతీయ స్థాయిలో పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు, అభిప్రాయాలతో ఉన్న రెండు రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో మాత్రం ఒకటిగా పనిచేస్తున్నాయని ఆరోపించారు.
కేంద్రమంత్రి హోదాలో బండి సంజయ్, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి ప్రకటనలు సిగ్గుచేటు అని విమర్శించారు. కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ వ్యాఖ్యల విషయంలో స్పందించాలని కోరారు. మనీశ్ సిసోడియా బెయిల్, కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో నిందితులకు మద్దతు పలికిన కాంగ్రెస్.. కవిత బెయిల్ విషయంలో మాత్రం నీచ రాజకీయాలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.