Mangli | ఖైరతాబాద్, ఏప్రిల్ 24 :మైక్రోఫైనాన్స్‌లో జరిగిన వందల కోట్ల స్కామ్‌లో సింగర్ మంగ్లీ ప్రత్యక్ష జోక్యం ఉందని, సోదరుడితో కలిసే మంగ్లీ తమను మోసగించిందని బాధితులు ఆరోపించారు. శుక్రవారం బంజారా సంఘాల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో గిరిజన జేఏసీ అధ్యక్షుడు సంపత్ నాయక్ మాట్లాడారు.
మంగ్లీ మీడియా సమక్షంలో అబద్ధ్దాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదన్నారు. ప్రధాన నిందితుడు రమావత్ మధుతో మంగ్లీకి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. స్కామ్‌లో అతనితో పాటు ఆమె కీలకంగా ఉన్నారని, తన సోదరుడిని తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని అబద్ధ్దాలు చెప్పిందని, 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పాటలు పాడి ప్రచారం చేశారని తెలిపారు. కర్ణాటకకు చెందిన ఓ మాజీ మంత్రి మనవడి వద్ద కూడా రూ.80లక్షల వరకు వసూలు చేశారని, ఆ ఫోన్ సంభాషణ వైరల్ అవుతున్నట్లు తెలిపారు.
అందులో మధు, మంగ్లీ సోదరుడు శివ ఈ లావాదేవీల్లో ఉన్నట్లు వెల్లడించారు. మధుకు సంబంధించిన పార్టీకి మంగ్లీ అనేక సార్లు హాజరయ్యారని, ఆమెకు సంబంధించిన కార్యక్రమాల్లోనూ మధు పాల్గొనేవాడని పేర్కొన్నారు. దానికి సంబంధించిన అన్ని వివరాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.
అనంతరం గిరిజన జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ రాథోడ్ మాట్లాడుతూ మైక్రోఫైనాన్స్ స్కామ్‌లో మంగ్లీ, ఆమె సోదరుడి ప్రత్యక్ష ప్రమేయం ఉందని, పోలీసులు కేసు దర్యాప్తును కావాలనే తాత్సారం చేస్తున్నారన్నారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనతరం రమావత్ మధు క్యాషియర్ రమేశ్ మట్లాడుతూ మంగ్లీతో మధుకు సంబంధం లేదన్నది పచ్చి అబద్ధ్దమన్నారు. మంగ్లీ తరచూ మధు ఆఫీసుకు వస్తుండేవారని తెలిపారు. ఆమె సోదరుడు శివ ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా ఉన్నట్లు వెల్లడించారు. బాధితులందరూ తన సమక్షంలోనే పెట్టుబడులు పెట్టారని వెల్లడించారు.

18
రూ.50 లక్షలు ఇచ్చాను
రమావత్ మధుకు రూ.50లక్షలు ఇచ్చాను. లాభాలంటూ రూ.4లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొన్నాడు. ఎగుమతి, దిగుమతి వ్యాపారం, రియల్ ఎస్టేట్, ప్లాట్ ఇస్తామంటే నమ్మి డబ్బులు చెల్లించాను. నాతోపాటే మా గ్రామానికి చెందిన రమావత్ నగేశ్ రూ.24.50లక్షలు, రమావత్ పీక్యా రూ.60.50లక్షలు, చంద్యానాయక్ రూ.48 లక్షలు, రమావత్ కోటేశ్ 6.90కోట్లు, రమావత్ హన్మా రూ.1.42కోట్లు, హన్ను నాయక్ రూ.69లక్షలు, ఛత్రూనాయక్ రూ.1.4కోట్లు, ఇస్లావత్ జయ్ నాయక్ రూ 18.52 కోట్లు, లక్ష్మా రూ.2.37కోట్లు, లచ్చిరాం నాయక్, రూ.24లక్షలు, లక్ష్మానాయక్ రూ.29కోట్లు, శిల్ప రూ.11లక్షలు ఇలా ఒక్కొక్కరి వద్ద ఒక్కో రకమైన లాభాలు వస్తాయంటూ నమ్మించి వసూలు చేశారు.
– రమావత్ అజయ్ కుమార్, బాధితుడు
రూ.4కోట్లు పెట్టుబడి పెట్టాను
మైక్రోఫైనాన్స్‌లో భాగా లాభాలు వస్తాయంటే నమ్మి చాలాచోట్ల డబ్బులు తెచ్చి కట్టాను. సుమారు రూ.4 కోట్లు వరకు పెట్టుబడి పెట్టాను. ఇప్పటి వరకు రూపాయి కూడా చెల్లించలేదు.
– బానావత్ భగవాన్, బాధితుడు
తప్పించుకునే ప్రయత్నం
మంగ్లీ స్వయంగా ఈ వ్యవహారంలో ఉందనడంలో అనుమానం లేదు. మోసం చేయడంతో పాటు బాధితుల పక్షాన మాట్లాడితే కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు పోరాడుతా.
– ప్రత్యూష రాథోడ్, బంజారా సంఘం నాయకురాలు
14లక్షలు పెట్టుబడి పెట్టా
మధు చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు మాయమాటలు చెప్పిన మంగ్లీ పరిచయస్తుడు అమీర్ పటేల్ ద్వారా బిజినెస్‌లో సొమ్ము ఇచ్చిన. రూ.14లక్షలు వరకు పెట్టుబడి పెట్టాను. అప్పు వేధింపులు ఎక్కువయ్యాయి. ఇక నాకు ఆత్మహత్యే శరణ్యం.
-రమావత్ శ్రీనివాస్, పిల్లిగుండ్ల తండా