హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ)/చేవెళ్ల రూరల్: హైదరాబాద్ నగర శివారు చేవెళ్ల ప్రాంతంలోని ఈర్లపల్లి త్రిపుర రిసార్ట్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు అందిన సమాచారంతో మంగళవారం రాత్రి ఒంటిగంటకు సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు, చేవెళ్ల, రాజేంద్రనగర్ పోలీసులతో కలిసి దాడులు నిర్వ హించారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ పార్టీ గాయని సత్య వతి రాథోడ్ (మంగ్లి) పుట్టినరోజు వేడుక అనీ, పార్టీకి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీప్రముఖులు మొత్తం 50 మంది హాజరయ్యారని గుర్తించారు. రిసార్ట్‌లో అనుమతిలేని విదేశీమద్యం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అక్కడి పరిస్థితులను వీడియో తీస్తుండగా ‘వీడియో అపు’ అంటూ మంగ్లీ మాట్లాడినట్టు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
మంగ్లీ బర్త్‌డే వేడుకలో గంజాయి లభించిందని, డ్రగ్స్ పరీక్షలో 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చిందని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ పార్టీలో పాల్గొన్న ఒకరికి మా త్రమే గంజాయి పాజిటివ్ వచ్చిందని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. అతడు 3 రోజుల క్రితం వేరేచోట సేవించినట్టు తెలిపాడని పేర్కొన్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి, నోటీసులు ఇచ్చామని వివరించారు. మంగ్లీ, గంజాయి పాజిటివ్ వచ్చిన దామోదర్‌రెడ్డి, రిసార్ట్ నిర్వాహకుడు శివరామకృష్ణ, డీజే ఆపరేటర్ మేఘనాథ్‌పై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.
బర్త్‌డే పార్టీపై స్పందించిన మంగ్లీ.. ఆధారాలు లేని ఆరోపణలు చేయకూడదని మీడియాకు విజ్ఞప్తి చేశారు. పార్టీలో మద్యం వినియోగం, డీజే ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలనే విషయం కూడా తనకు అవగాహన లేదని తెలిపారు. బుధవారం ఓ వీడియో విడుదల చేశారు. అమ్మనాన్న, బంధుమిత్రులతో కలిసి జరుపుకున్న పుట్టినరోజు వేడుక మాత్రమే అని, అక్కడ డ్రగ్స్, గంజాయి ఏమీ దొరకలేదని చెప్పారు.