ముప్కాల్, డిసెంబర్ 10 : సీఎం కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు సింగరి హేమంత్, ఆయన అనుచరులు శనివారం హైదరాబాద్‌లో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా మంత్రి మాట్ల్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనతి కాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. తెలంగాణ ప్రగతి దేశానికి రోల్‌మాడల్ అన్నారు. తెలంగాణ మాదిరి తమకూ అభివృద్ధి కావాలని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్తోనే దేశ పురోగతి సాధ్యమని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని మంత్రి తెలిపారు.