నాడు కేంద్రం దగా సింగరేణి పరిస్థితి దినదిన గండంగానే మారింది. ఇప్పటికే కేంద్రం 119.6 మిలియన్ టన్నులున్న కోయగూడెం బ్లాక్-3ని ఆరో మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, 69.6 మిలియన్ టన్నుల సత్తుపల్లి బ్లాక్-3ని శ్రీఅవంతిక కాంట్రాక్టర్స్ లిమిటెడ్ సంస్థలకు అమ్మేసింది. భారీగా బొగ్గు నిల్వలున్న ఈ రెండు బ్లాకులను కోల్పోవడం వల్ల సింగరేణికి భారీ నష్టం వాటిల్లగా, కొత్తగా ప్రకాశం ఖని ఎక్స్టెన్షన్ బ్లాకును వేలంలో విక్రయించేందుకు మోదీ సర్కార్ అడుగులు వేయడం ఆందోళన కలిగిస్తున్నది.
నేడు అదే బాటలో రాష్ట్రం కేంద్రానికి తామేమీ తక్కువ కాదన్నట్టు రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ వ్యవహరి స్తున్నది. సింగరేణి ఆధ్వర్యంలోని నైని బొగ్గు బ్లాక్‌ను అన్ని విధాలా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, మరో ద్రోహం చేసేందుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులను నిర్దాక్షిణ్యంగా అమ్మేస్తుంటే అడ్డుకోవాల్సిందిపోయి వత్తాసు పలుకుతున్నట్టు తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. చరిత్రలో లేని విధంగా బొగ్గు ఉత్పత్తిని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేందుకు టెండర్లు ఆహ్వానించిన తీరు, కేంద్రాన్ని అనుసరిస్తుందని చెప్పేందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.
కరీంనగర్, జనవరి 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/గోదావరిఖని/హైదరాబాద్ : సిరులవేణి సింగరేణిపై అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం విషం చిమ్ముతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని నిబంధనలు పెడుతూ ఆ సంస్థను నిర్వీర్యం చేయడంతో పాటు ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే రెండు బొగ్గు గనులను కేంద్రం వేలం ద్వారా అమ్మి ప్రైవేట్‌కు ద్వారాలు తెరువగా.. ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా అదేబాటలో నడుస్తున్నది. ఓవర్ బర్డెన్(మట్టి తొలగింపు) పనులకు ‘సైట్ విజిట్’ నిబంధనను ముందుగా తెచ్చి, ఆ తర్వాత నైని బొగ్గు బ్లాక్‌లో ఏకంగా బొగ్గు ఉత్పత్తిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్(ఎండీవో) పేరిట టెండర్లు పిలిచింది. సింగరేణి చేతిలో ఉండాల్సిన ఈ గనిని 25 ఏండ్ల పాటు ప్రైవేట్ కంపెనీల చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. అంటే పేరు మాత్రమే సింగరేణిది, గనిపై పూర్తి అధికారాలు ప్రైవేట్ సంస్థకే ఉంటాయి. ఇలా స్వరాష్ట్రంలో సిరులు కురిపించిన సింగరేణి.. కేంద్ర, రాష్ట్ర పాలకుల నిర్ణయాలతో తన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇదే జరిగితే సంస్థ కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో ‘సింగరేణి బచావో’ ఉద్యమం మొదలయ్యే అవకాశం కనిపిస్తున్నది.
కొత్త నిబంధనలతో ప్రైవేట్‌కు దారులు
ఇటీవల చేర్చిన నిబంధనలు, పరిణామాలను నిశితంగా గమనిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. సంస్థలో ఇప్పటివరకు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గుపై కప్పబడి ఉండే ఓబీ పనులు మాత్రమే ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక నుంచి ఓబీతో పాటు బొగ్గు వెలికితీత పనులు ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లనున్నాయి. సింగరేణికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాక్‌లో కొత్తగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎండీవో పేరిట టెండర్లను పిలువడంతో ఇక నుంచి ఈ బ్లాక్‌లో అన్ని పనులు ప్రైవేట్ వ్యక్తులే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న నైనీ బ్లాక్ నుంచి ఏటా 10 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని గత బీఆర్ఎస్ సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలోనే పనులు ప్రారంభమై గతేడాదిలో బొగ్గు ఉత్పత్తి వెలికితీశారు. అప్పటివరకు సాఫీగా జరుగగా, కాంగ్రెస్ ప్రభుత్వం నైనీ బ్లాక్‌ను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టే కుట్రలు చేసి ఎండీవో పద్ధతిన టెండర్లు ఆహ్వానించింది.
ఈ విధానం వల్ల ఓపెన్ కాస్ట్లో బొగ్గుపై కప్పబడి ఉండే మట్టి తొలగింపుతో పాటు బొగ్గు వెలికితీత పనులు ప్రైవేట్ వ్యక్తులే చేస్తారు. పర్యవేక్షణ పనులను కొంతమంది అధికారులు మాత్రమే చేస్తారు. బొగ్గు ఉత్పత్తితో పాటు డంపింగ్ పనులన్నీ ప్రైవేట్ వ్యక్తులే చేయడం వల్ల సంస్థ యంత్రాలు, కార్మికులు, అధికారులు ఎవరి అవసరం లేకుండా పోతుంది. ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి ఎంత ఖర్చవుతుందో టెండర్లో ఏది కోట్ చేస్తారో? అది చెల్లిస్తే సరిపోతుంది. అందుకు గాను రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 25 ఏండ్ల కాలపరిమితితో టెండర్‌ను ఇటీవల జారీ చేసింది. ఈ టెండర్ సైతం అధికార కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు సాధించుకోవడానికి పోటీపడిన తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో సింగరేణి సంస్థ వాటిని రద్దు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే. అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చేందుకు తాత్కాలికంగా టెండర్లను నిలిపివేసినా, మళ్లీ అదే పద్ధతిలో టెండర్లను పిలిచేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది.
టెండర్ రద్దు చేసినా దక్కించుకునేందుకే ప్రయత్నాలు?
వివాదాల మధ్య నైనీ బ్లాకు టెండర్‌ను తాత్కాలికంగా రద్దు చేసినా మరో రూపంలో తమకు అనుకూలంగా ఉండే వారికి కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాదాలు చుట్టుముట్టడంతో రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నిబంధనలను మార్చుతామని కానీ, బొగ్గు ఉత్పత్తితో ప్రమేయం లేకుండా టెండర్లు పిలుస్తామని కానీ ప్రకటించలేదు. దీనిని బట్టి పాత పద్ధతిలోనే టెండర్లను పిలిచే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించే ఈ ప్రాజెక్టును 25 సంవత్సరాలపాటు సింగరేణి కార్మికుల అధికారుల ప్రమేయం లేకుండా కేవలం ప్రైవేట్ వ్యక్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వారు ఉత్పత్తి చేసే బొగ్గును అమ్ముకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా ఉండడంపై కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
నైనీ బ్లాక్ క్యాప్టివ్‌మైన్
నైనీ కోల్ బ్లాక్ ఓపెన్‌కాస్టు. పైగా ఇది క్యాప్టివ్ మైన్. కమర్షియల్ మైన్ కాదు. ఈ గని నుంచి వెలికితీసిన బొగ్గును సింగరేణి సంస్థ తన సొంత అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలి. ప్రైవేట్ సంస్థలకు విక్రయించే అవకాశం లేదు. వాస్తవానికి ఈ బొగ్గును మంచిర్యాల సమీపంలోని జైపూర్ థర్మల్‌ప్లాంట్‌లో వినియోగించాలి. కానీ నైనీ నుంచి బొగ్గు రవాణా చేసేందుకు రైల్వే నెట్వర్క్లేదు. పైగా దూరం అధికంగా ఉండటంతో నైనీలోనే 800 మోగావాట్ల సామర్థ్యం గల రెండు థర్మల్‌ప్లాంట్లు(1600 మెగావాట్ల) ప్లాంట్లను నిర్మించాలని సింగరేణి నిర్ణయించింది. అయితే ఈ ప్లాంట్లు కట్టాలంటే 6-8 ఏండ్లు పట్టే అవకాశముంది. క్యాప్టిన్మైన్లో ఉత్పత్తి చేసిన బొగ్గును లాభాపేక్ష లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు విక్రయించవచ్చు. ఈ నేపథ్యంలోనే సింగరేణి కొంతకాలం క్రితం బొగ్గు విక్రయించేందుకు తమిళనాడు జెన్కోతో ఒప్పందం కూడా చేసుకున్నది.
ప్రభుత్వ నిర్ణయం ఓసీపీలకు అశనిపాతం
నైనీ బ్లాక్‌ను ప్రైవేటుపరం చేయాలనే కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులకు అశనిపాతంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేవలం మట్టి తొలగింపు పనులు మాత్రమే ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తుండగా.. కొత్త విధానాన్ని అన్ని ఓపెన్ కాస్ట్ గనులకు వర్తింపజేస్తే అన్ని గనుల్లో సింగరేణి అధికారులు, కార్మికుల పాత్ర శూన్యంగా మారే ప్రమాదం ఉన్నది. ఓపెన్ కాస్ట్ గనుల్లోనే పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికుల కృషి ఫలితంగానే భారీగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్నారు. ఇదంతా ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తే సింగరేణి మనుగడ ప్రమాదంలో పడిపోతుందని కార్మికులు, కార్మిక సంఘాల నాయకుల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతున్నది. రేవంత్ సర్కార్ తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల కేంద్రం ఇంకా దూకుడుగా వెళ్లే ప్రమాదం ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
రెండు వేల ఉద్యోగాలు పోయినట్టే
నైనీ కోల్‌బ్లాక్‌ను ఎండీవో విధానంలో ప్రైవేట్‌పరం చేయడం వల్ల రెండు వేలకు పైగా ఉద్యోగాలకు కోతపడనున్నదని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. నైనీని సింగరేణియే చేపడితే ఈ ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కేవంటున్నాయి. మన దగ్గర సత్తుపల్లిలో ఓబీ ప్రైవేట్ ద్వారా బొగ్గును సింగరేణి కార్మికులతో వెలికితీస్తున్నారు. ఈ విధానం చేపట్టినా తక్కువలో తక్కువ 500మందికి ఉపాధి దొరికేదని, ఎండీవో విధానం వల్ల ఈ ఉద్యోగాలు పోయినట్టేనని అంటున్నాయి. ప్రస్తుతం 50మందికి పైగా సింగరేణి ఉద్యోగులు, కార్మికులు నైనీలో పనిచేస్తున్నారు. రేపు ఎండీవో విధానంలో టెండర్లు ఖరారు చేస్తే ఈ 50మంది అవసరం కూడా ఉండదు. కేవలం ఐదుగురుంటే సరిపోతుందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. రెండు వేల మంది సింగరేణి సంస్థ ఉద్యోగులు పనిచేయాల్సి చోట.. ఎండీవో విధానంతో ఐదుగురికి మాత్రమే పరిమితవుతుందని కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో కార్మికులే కీలక పాత్ర
సమైక్యపాలనలో అస్తిత్వం కోల్పోయిన సింగరేణిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో అద్భుతంగా మార్చడంతో పాటు అనూహ్య ప్రగతితో సంస్థను ముందుకు తీసుకెళ్లింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో కార్మికుల ఉద్యోగ భద్రతకు పెద్దపీట వేశారు. కొత్తగా ఉద్యోగాలు సృష్టించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి సుమారు 20వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. బీఆర్ఎస్ హయాంలో కార్మికుల సంఖ్య తగ్గకుండా చూడడంతో పాటు బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కార్మికులే కీలకపాత్ర వహించేలా చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు సానుకూలంగా ఉండడంతో కార్మికులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం వల్ల రికార్డు స్థాయిలో ఉత్పత్తితో గణనీయమైన వృద్ధితో సాధించింది. కానీ రెండేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇచ్చిన హామీలు అటుంచి డిపెండెంట్ కొలువులకు మంగళం పాడింది. ఇప్పుడు గనుల్లో బొగ్గు ఉత్పత్తిని సైతం ప్రైవేట్‌కు అప్పగించాలని చూస్తున్నది. దీనివల్ల సంస్థకు ఎంతో నష్టం వాటిల్లే ముప్పు కనిపిస్తుండగా కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కోసం రూ.500కోట్లు ఖర్చు
నిర్వాసిత గ్రామాల ప్రజలకు మెరుగైన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, సీఎస్సార్ పనులను సింగరేణి సంస్థయే చేపట్టాల్సి ఉన్నది. ఈ బ్లాక్ కోసం సంస్థ రూ.491 కోట్లు ఖర్చుచేసింది. 643 హెక్టార్ల అటవీ భూమి బదలాయింపు కోసం దాదాపు రూ.180కోట్లను ఒడిశా ప్రభుత్వానికి చెల్లించింది. వన్యప్రాణి నిర్వహణ ప్రణాళికలో భాగంగా రూ.39 కోట్లు సర్కారుకు డిపాజిట్ చేసింది. ఇదంతా సింగరేణిదే సొమ్ము. ఇలా వందల కోట్లు సింగరేణి నిధులను ఖర్చుచేసిన తర్వాత ఇప్పుడు ప్రైవేట్‌కు కట్టబెట్టడం గమనార్హం.