హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): సింగేరణి థర్మల్ విద్యుత్తు కేంద్రం (ఎస్టీపీపీ) 100 శాతం ఫ్లైయాష్ వినియోగించిన ప్లాంట్‌గా గుర్తింపు పొందింది. మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని ఎస్టీపీపీ నుంచి వెలువడే ఫ్లైయాష్‌ను వందశాతానికి పైగా సద్వినియోగం చేసుకొని పర్యావరణహితంగా వ్యవహరిస్తున్నందుకు ముంబైలోని మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ ఉత్తమ ఫ్లైయాష్ యుటిలైజేషన్ అవార్డు-2022ను ప్రదానంచేసింది.
దక్షిణ భారతదేశంలో 500 మెగావాట్లు అంతకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్తు కేంద్రాల జాబితాలో ఈ పురస్కారం దక్కింది. శనివారం గోవాలో సింగరేణి డైరెక్టర్ డీ సత్యనారాయణరావుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ మాజీ ముఖ్య కార్యదర్శి మనోరంజన్ హోటా అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విద్యుత్తు కేంద్రాల జాబితాలో జైపూర్ ఎస్టీపీపీ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. కార్యక్రమంలో సింగరేణి డీజీఎం (వాటర్ సిస్టం) జనగామ శ్రీనివాస్, ఎస్ఈలు కేవీ శ్రీనివాస్, ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయిలో అవార్డు అందుకున్నందుకు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ అభినందనలు తెలిపారు.