హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్ఎంఈఎల్ (ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజినీరింగ్ లిమిటెడ్) ప్రపంచస్థాయి సంస్థలతో పోటీపడాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సూచించారు. వనరులను వినియోగించుకొని అత్యున్నతస్థాయికి ఎదగాలని చెప్పారు. గురువారం సింగరేణి సీఎండీ బలరాంతో కలిసి విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న ఏపీహెచ్ఎంఈఎల్ను సందర్శించారు.
సంస్థ అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సంస్థ అభివృద్ధి కోసం త్వరలోనే కన్సల్టెన్సీని నియమిస్తామని వెల్లడించారు. కార్మికుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంస్థ నిర్వాహకులను భట్టివిక్రమార్క ఆదేశించారు. సింగరేణికి అవసరమైన యంత్రాల తయారీ, మరమ్మతులకే పరిమితం కావొద్దని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.