హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌కు సింగరేణి సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించి డబ్బులను ఖర్చు చేయడమేంటని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ డబ్బులను సింగరేణిలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి లేదా కార్మికుల సంక్షేమానికి వెచ్చించాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు శుక్రవారం ఆయన సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ధర్నాకు దిగారు. పోలీసులు ఏలేటిని ఆరెస్ట్ చేసి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖలు దుబారా ఖర్చులు చేస్తే కట్టడి చేయాల్సిన సీఎం స్వయంగా తన సరదా కోసం ప్రజాధనాన్ని వృథా చేయడం ఆర్థిక నేరమేనని ఆరోపించారు.
మెస్సీ టీమ్‌తో రేవంత్‌రెడ్డి టీమ్ ఫుట్‌బాల్ ఆడటం వల్ల రాష్ర్టానికి వచ్చే ప్రయోజనమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. మెస్సీ ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు అప్పియరెన్స్ ఫీజు కింద రూ.70 కోట్లు తీసుకుంటారని, ఆ మొత్తాన్ని ఏ ప్రభుత్వ శాఖ ఇస్తున్నదో, అసలు సింగరేణి సంస్థ ఎందుకు స్పాన్సర్‌గా ముందుకు వచ్చిందో చెప్పాలని నిలదీశారు. ఈ మ్యాచ్‌తో తెలంగాణ ఎలా రైజింగ్ అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహణ కోసం ప్రజాధనం ఖర్చు చేయడంపై క్యాబినెట్లో చర్చించారా? అని ప్రశ్నించారు.