Singareni | గోదావరిఖని : రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. భారీ బొగ్గు ఉత్పత్తి లక్ష్యమైన 72 మిలియన్ టన్నులు సాధించేందుకు శతవిధాలా ప్రయత్నించిన సింగరేణి చతికిల పడిపోయింది.
మార్చి 21 నాటికి సింగరేణి సంస్థలో 65.90 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం కేవలం పది రోజులు మిగిలి ఉండడం 10 రోజుల్లో 6.1 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు ప్రస్తుత మార్చి నెలలో యావరేజ్‌గా ప్రతిరోజు రెండున్నర లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరుగుతుంది. అంటే మిగిలిన 10 రోజుల్లో కేవలం రెండున్నర మిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తి సాధించే అవకాశాలతో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధన సాధ్యం కాదని ఇప్పటికే అధికారులు చేతులెత్తేశారు.
గత ఏడాది ఇదే కాలంలో 67.63 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది గత ఏడాది కన్నా ఇప్పటికే 17.28 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి వెనుకబడి ఉండడం వల్ల గత ఏడాది సాధించిన 70.02 మిలియన్ టన్నులు కూడా సాధించే అవకాశాలు కనిపించడం లేదు. బొగ్గు ఉత్పత్తి తగ్గడం లాభాలపై ప్రభావం చూపుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సింగరేణి సంస్థలు బొగ్గు ఉత్పత్తి వెనుకబడినప్పటికీ ఇప్పటికే ఇల్లందు ఏరియా 105% రామగుండం డివిజన్ త్రి ఏరియా 101% బొగ్గు ఉత్పత్తి సాధించడం విశేషం మార్చి నెలలో అధికారులు చేసిన కృషి కారణంగా కార్మికులు అధికంగా కష్టపడడం వల్ల భారీ బొగ్గు ఉత్పత్తి సాధ్యమైంది.
మార్చి 1 నుండి 21 వరకు 5215470 టన్నుల లక్ష్యానికి గాను 5814588 టన్నులు (111%) సాధించింది. కార్మికులకు ప్రవేశపెట్టిన ప్రోత్సాహక బహుమతులు బొగ్గు ఉత్పత్తి మార్చి నెలలో పెరగడానికి కొంత తోడ్పడింది. ఏది ఏమైనా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గడాన్ని సీరియస్ గా పరిగణిస్తూ సింగరేణి యాజమాన్యం సమీక్ష చేస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించిన సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు మిలియన్ టన్నుల అదనపు బొగ్గు ఉత్పత్తి సాధించి 72 మిలియన్ టన్నులు టార్గెట్‌గా నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 68.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధ్యమయ్యే అవకాశాలతో వెనుకబడి ఉన్నాం 3.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి వల్ల అనుకున్నా ఆదాయం తగ్గి లాభాల్లో సైతం తేడాలు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.