హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): సర్కారు బడుల పరిశుభ్రతకు సింగరేణి సంస్థ నిధులను ఖర్చుచేయనున్నారు. ఈ సంస్థ ద్వారా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్టుకు(డీఎంఎఫ్టీ) సమకూరిన నిధులను వినియోగించనున్నారు. నెలకు రూ.13 కోట్లను సింగరేణి సంస్థ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఖాతాల్లో జమచేయనుంది. రాష్ట్రంలోని 26,287 స్కూళ్లకు నెలకు రూ.13.61కోట్లు కానుండగా, 10 నెలలకు రూ.136.10 కోట్లు ఖర్చుచేస్తారు. తాజాగా మూడు నెలలకు సంబంధించి రూ.40.83 కోట్లను విడుదల చేయాలని మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టరేట్ అధికారులు సింగరేణి సంస్థ సీఎండీకి లేఖ రాశారు. డీఎంఎఫ్టీ నిధులను మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చుచేయాల్సి ఉండగా, నిబంధనలను అతిక్రమించి సర్కారు రాష్ట్రవ్యాప్తంగా ఖర్చుచేస్తుంది.
‘విద్యుత్తు ఉద్యమం పార్టీలకు గుణపాఠం’
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఉద్యమ అమరవీరులు ఎస్ రామకృష్ణ, జీ విష్ణువర్ధన్, వీ బాలస్వామికి వివిధ వామపక్ష పార్టీల నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజావ్యతిరేక పాలన సాగించే ఏ ప్రభుత్వమైనా ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వామపక్షాలు హెచ్చరించాయి. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతలాగా వ్యవహరించే పాలకులకు 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్తు ఉద్యమం ఒక గుణపాఠమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పల్లా వెంకట్రెడ్డి, తకళ్లపల్లి శ్రీనివాస్, సీపీఎం నేతలు డీజీ నర్సింహారావు, జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.