మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 14 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ సమీపంలో గల ఓ రెసిడెన్సీలో సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల పట్టణ ఎస్ఐ మధుసూదన్, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం సోనాపూర్‌కు చెందిన అరిగెల సాయికిరణ్ గౌడ్(30) సింగరేణిలో మూడు సంవత్సరాలుగా సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ.. ఇంటి వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండెకరాల భూమి ఉండగా.. మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఇందులో పత్తి, కంది పంటలు వేశాడు. సాగు కోసం రూ.6 లక్షలు అప్పు తెచ్చాడు. ఇటు పంట దిగుబడి రాక అటు కాంట్రాక్ట్ పనులో నష్టం రావడంతో ఆర్థికంగా నష్టపోయాడు. ఈ నెల 9న బిల్లుల కోసం జీఎం ఆఫీస్‌కు వెళ్తున్నానని చెప్పి మంచిర్యాలకు వచ్చాడు. హోటల్లో అద్దెకు ఉంటున్నాడు. మంగళవారం ఉదయం వరకు సాయికిరణ్ బయటకు రాకపోవడంతో అనుమానంతో డోర్ పగులగొట్టి చూడగా, సీలింగ్ ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకొని కనిపించాడు.