యైటింక్లయిన్కాలనీ, డిసెంబర్ 28: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి అద్భుతమైన పర్యాటక కేంద్రమని ఆ సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్) ఎస్ చంద్రశేఖర్ అన్నారు. ఆర్జీ-2 ఏరియాలో మూసివేసిన 7ఎల్ఈపీ గనిని యాజమాన్యం పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయడంతో బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అంతకుముందు బొగ్గు నిక్షేపాల తీరు, భూగర్భ గనులు, ఓసీపీల్లో పని స్థలాలు, భారీ యంత్రాలు, మ్యాన్రైడింగ్ను పర్యాటకులతో కలిసి వీక్షించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ, సింగరేణి సంయుక్తంగా తొలిసారి 7ఎల్ఈపీ గనిని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేశామని తెలిపారు. సింగరేణి గురించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నామని చెప్పారు. తొలిసారిగా ఆర్టీసీ హైదరాబాద్ నుంచి కోల్ టూరిజం పేరిట బస్సులను నడుపుతున్నదని అన్నారు.