రెబ్బెన : సింగరేణి ( Singareni ) సంస్థ బెల్లంపల్లి ఏరియాకు నిర్దేశించిన వార్షిక బొగ్గు ఉత్పత్తిని సమష్టి కృషితో అధిగమించాలని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి ( Vijayabhaskar Reddy) సూచించారు. బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓపెన్ కాస్ట్లో గురువారం నూతన షవల్ యంత్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ( Operation Sindoor) పేరును నూతన షావల్ యంత్రానికి పెట్టామని వివరించారు. అధికారులు ,ఉద్యోగులు ఎప్పటికప్పుడు యంత్రాల పనితీరు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. ఉద్యోగులందరూ సింగరేణి సంస్థ యంత్రాలు వాహనాలను స్వంత వాహనాల మాదిరిగా చూసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి, పీవో మచ్చగిరి నరేందర్ , ఏరియా ఎస్వో టూ జీఎం రాజమల్లు, ఏరియా ఇంజినీర్ రామనాథం , ఏరియా సెక్యూరిటీ అధికారి ఉమాకాంత్ ,ప్రాజెక్టు ఇంజనీర్ వీరన్న, గని మేనేజర్ శంకర్తోపాటు పలువురు పాల్గొన్నారు.
రోస్టర్ ప్రకారమే పదోన్నతులు
బెల్లంపల్లి ఏరియాలో అన్ని పదోన్నతులు రోస్టర్ ప్రకారమే జరుగుతున్నాయని జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ రోస్టర్ రిజిస్టర్ వెరిఫికేషన్ కార్పొరేట్ కమిటీ సభ్యులు పర్యటించారు. బెల్లంపల్లి ఏరియాలో విధులు నిర్వహిస్తున్న ఎస్సీ ఉద్యోగుల రోస్టర్ను సింగరేణి కార్పొరేట్ చీఫ్ లైసన్ ఆఫీసర్, మణుగూరు ఏరియా జీఎం దుర్గం రామచందర్ తనీఖీ నిర్వహించారు. ఏరియాలో ఎస్సీ ఉద్యోగుల ఖాళీల భర్తీలు ,పదోన్నతులు సంబంధించిన రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.