రాజన్న సిరిసిల్ల : అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన దివంగత చేనేత కళాకారుడు నల్ల పరంధాములు బాటలోనే ఆయన తనయుడు నల్ల జగదీశ్ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. తెలుగు భాషపై ఉన్న అభిమానంతో అక్షరమాలను డిజైన్ చేసి పట్టుచీరను సరికొత్త రూపంలో చేనేత మగ్గంపై నేశాడు.
తెలుగు అక్షరాలు పుస్తకాల్లోనే కాకుండా సంప్రదాయ వస్ర్తాలపై కూడా కళారూపకంగా కనిపించాలనే ఆలోచనతోనే ఈ పట్టుచీర నేసినట్టు జగదీశ్ వివరించాడు. ఈ చీర బరువు 650 గ్రాములు, పొడవు 6.30 మీటర్లు ఉంటుందని చెప్పాడు. రాఖీ పౌర్ణమి వేళ చీరను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నాడు.