వరంగల్ : వరంగల్ జిల్లాలోని గీసుగోండ మండలంలో ప్రసిద్ధిగాంచిన కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన రాజగోపురం శిఖర ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి దేవనాధ రామానుజ జీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli Dayakar Rao), జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యాగశాలలో హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ రాజగోపురం శిఖర ప్రతిష్టాపన వేదపండితుల సమక్షంలో చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్(CM KCR) వచ్చాకే దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. ‘ యాదాద్రి మహిమాన్విత క్షేత్రంగా మారింది. ఇదే తరహాలో పాలకుర్తి నియోజకవర్గం లోని దేవాలయాలను కూడా పునరుద్ధరిస్తూ పూర్వ వైభవాన్ని తెస్తున్నాం. ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నామని ’ వెల్లడించారు.
ప్రజల్లో భక్తి ప్రపత్తులు పెరిగి, ప్రజల్లో సాత్విక లక్షణాలు పెంపొందాల్సిన అవసరం ఉందని, భక్తి భావంతో సమాజంలో శాంతి ని నెలకొల్పవచ్చని అన్నారు. స్థానిక శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కోరగా సానుకూలంగా స్పందించారు. మాస్టర్ ప్లాన్ సంబంధిత అధికారులతో చేయించి ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ, మండల నాయకులు, భక్తులు పాల్గొన్నారు.