హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థలను (డిస్కమ్‌లను) త్వరలో ప్రైవేటీకరించబోతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. వీటిని ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రైతు డిస్కమ్‌ను ఏర్పాటు చేసిందని విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లు అనుమానిస్తున్నారు. ఉచిత విద్యుత్తు కనెక్షన్లను ఓ దగ్గర, లాభాలొచ్చే కమర్షియల్, ఇండస్ట్రియల్ కనెక్షన్లను మరో దగ్గర చేర్చి ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లను ప్రైవేటీకరిస్తారని, దీంతో ఆయా కంపెనీలు లాభాపేక్షతో వినియోగదారులపై అదనపు భారాన్ని మోపుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ర్టాల్లో విద్యుత్తు పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ, ప్రాంఛైజీ ప్రయోగాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, తెలంగాణలోనూ ఇది విఫల ప్రయోగం అవతుందని అభిప్రాయపడుతున్నారు.
వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేషన్, జలమండలి లాంటి ఉచిత కనెక్షన్లను వేరుచేయడం వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదని, డిస్కమ్‌ల ప్రైవేటీకరణకు వ్యూహాత్మకంగా ద్వారాలు తెరువబోతున్నారని తెలుస్తున్నది. దీనిలో భాగంగా తొలుత పథకం ప్రకారం వ్యవసాయ ఫీడర్లకు మీటర్లు పెడుతారు. ఆ తర్వాత మిగిలేది కమర్షియల్ కనెక్షన్లే. వాస్తవానికి కమర్షియల్ కనెక్షన్ల ద్వారానే డిస్కమ్‌లకు ఆదాయం వస్తుంది. నష్టాలు వచ్చే వ్యవసాయ కనెక్షన్లను తీసుకునేందుకు ప్రైవేట్ కంపెనీలు ముందుకు రావు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రైతు డిస్కమ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ కనెక్షన్లను వేరు చేసిందని, లాభాలొచ్చే కమర్షియల్ కనెక్షన్లను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టబోతున్నదని వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలోని విద్యుత్తు సరఫరా వ్యవస్థను అదానీ కంపెనీకి అప్పగించబోతున్నట్టు గతంలో సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించడంతోపాటు స్మార్ట్‌మీటర్లు బిగించే ఆలోచన చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం రైతు డిస్కమ్ ద్వారా స్మార్ట్‌మీటర్లు బిగించేందుకు రంగం సిద్ధమమైంది. దీంతో ఇక ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లను ప్రైవేటీకరించడమే మిగిలిందని విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లు అంటున్నారు.
విద్యుత్తు పంపిణీ రంగంలోకి ప్రైవేట్ సంస్థలను అనుమతించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నది. మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లాల పరిధిలో ప్రైవేట్ కంపెనీలకు విద్యుత్తు పంపిణీ లైసెన్సులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. విద్యుత్తు పంపిణీ వ్యవస్థలో మల్టిపుల్ లైసెన్సులను జారీచేయాలని చెప్తున్నది. విద్యుత్తు సవరణ బిల్లు ముసాయిదాలో ఇలాంటి అనేక అంశాలను పొందుపరిచింది. విద్యుత్తు పంపిణీలో పోటీతత్వాన్ని పెంచే పేరుతో ఒకే ప్రాంతంలో రెండు, మూడు డిస్కమ్‌లు పనిచేసేందుకు ఈ బిల్లు అనుమతిస్తుంది. తద్వారా ఒక డిస్కమ్ నెట్‌వర్క్‌ను మరో డిస్కమ్ వాడుకోవచ్చని చెప్తున్న కేంద్రం.. క్రాస్ సబ్సిడీని తొలగించాలని సూచించింది. దీంతో టాటా పవర్, అదానీ ఎనర్జీ, టొరెంట్ పవర్, సీఈఎన్సీ లాంటి సంస్థలు ఇప్పటికే విద్యుత్తు రంగంలోకి ప్రవేశించాయి.
ఇప్పటికే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, జమ్ము-కశ్మీర్, పుదుచ్చేరిలో విద్యుత్తు పంపిణీ వ్యవస్థలను ప్రైవేటీకరించారు. ఒడిశా, హర్యానా, చండీగఢ్, ముంబై నగరంలో కొంత భాగాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. కానీ, తెలంగాణ తరహాలో వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లను వేరుచేసి ప్రైవేటీకరించిన ఉదంతాలు ల్లేవు. ఆయా రాష్ర్టాల్లో భౌగోళిక ప్రాంతాన్ని ప్రైవేటీకరించగా.. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా అగ్రికల్చర్ ఫీడర్లను విభజించి కొత్త డిస్కమ్‌ను ఏర్పాటు చేశారు. దీనిపైనా అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. రెవెన్యూ లేకుండా కంపెనీని ప్రారంభించేందుకు కంపెనీల చట్టం అనుమతించదన్న వాదనలున్నాయి. రైతు డిస్కమ్‌కు సొంత ఆదాయ వనరులేమీ లేకపోవడంతో ఇది నడువడం అంత సులభం కాదనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకే రైతు డిస్కమ్‌ను ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నది. దీంతో ఇప్పుడున్న రెండు డిస్కమ్‌ల ద్వారా రైతులకు నాణ్యమైన విద్యత్తు అందడం లేదని సాక్షాత్త్తు ప్రభుత్వమే ఒప్పుకొన్నది. డిస్కమ్‌ల ప్రైవేటీకరణ జరిగితే విద్యుత్తు కమర్షియల్ వస్తువుగా మారుతుంది. దీంతో ఉచిత విద్యుత్తు, సామాన్యులకు సబ్సిడీలు అందవు. రైతులకు ఉపయోగపడే పథకాలు పూర్తిగా రద్దయ్యే ప్రమాదం పొంచి ఉన్నది.
రైతు డిస్కమ్‌పై తమకు పలు అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఇటీవల ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు డిస్కమ్ విధివిధానాలపై కమిటీ వేయడంతోపాటు ఈ డిస్కమ్‌కు అవసరమైన కొత్తపోస్టులను మంజూరు చేయాలని కోరింది. ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ముందుకెళ్తే ఉద్యమం తప్పదని, ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లను ప్రైవేటీకరిస్తే ఊరుకోబోమని హెచ్చరించింది.
రాష్ట్రంలో రైతు డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని ఎవరూ కోరలేదు. ఈ డిస్కమ్ ఏర్పాటుతో రైతులతోపాటు విద్యుత్తు ఉద్యోగులకు తీరని నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతమున్న ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లకు, రైతు డిస్కమ్‌కు మధ్య సమన్వయం కొరవడి రైతులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నది. ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్లు, కస్టమర్ సర్వీస్ సెంటర్లు, జిల్లా స్టోర్స్‌ను రైతు డిస్కమ్ ఏర్పాటు చేయగలుగుతుందా? కేవలం వెయ్యి మంది సిబ్బందితో కూడిన రైతు డిస్కమ్ 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లను, 5.5 లక్షల ట్రాన్స్ఫార్మర్లను నిర్వహించగలగుతుందా?