పటాన్చెరు, జూలై 1/పటాన్చెరు రూరల్ : ‘ఓరి దేవుడా.. మా బిడ్డలెక్కడ? పొట్టకూటి కోసం వస్తే శవాలను చేశావు కదయ్యా’ అంటూ కార్మికుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలతో పటాన్చెరు ఏరియా దవాఖానలో విషాదం అలుముకున్నది. పుట్టినగడ్డపై ఉపాధి కరువై.. పొట్టచేత పట్టుకొని వందలాది కిలోమీటర్లు వలసొచ్చి పనులు చేసుకుంటుంటే ఒకేసారి ప్రమాదం జరిగి తమ బిడ్డలను పోగొట్టుకున్నామని కన్నీటిపర్యంతమవుతున్నారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలిన భారీ ప్రమాదంలో అధికారిక లెక్కల ప్రకారం 39 మంది చనిపోయినట్టు ప్రకటించారు. 17 మంది గల్లంతయ్యారని, వారి కోసం గాలిస్తున్నామని అధికారులు ప్రకటించారు. ప్రమా దం జరిగిన సమయంలో రసాయన ఫ్యాక్టరీ లో 143 మంది కార్మికులు ఉన్నారని చెప్పా రు. ఈ ఘటన జరిగిన తర్వాత 53 మంది సమాచారం తెలిసిందని, కొందరి సమాచారం తెలియకపోవడంతో కుటుంబసభ్యులు, బం ధువులు రాత్రి నుంచి పటాన్చెరు సర్కారు దవాఖాన వద్దే పడిగాపులు కాస్తున్నారు.
అధికారులు, ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికుల సమాచారం తెలపడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కార్మికుల సమాచారం తెలుపడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు. గల్లంతైన కార్మికుల సమాచారం కోసం కుటుంబసభ్యులు వైద్యు లు, పోలీసులు, రెవెన్యూ అధికారులను అడిగినా సమాచారం ఇవ్వడం లేదని దవాఖాన వద్ద పలువురు తెలిపారు. ఫ్యాక్టరీలో అడ్మినిస్ట్రేషన్ భవనం కూలిపోవడంతో ఎంతో మంది కార్మికులు శిథిలాల కింద ఉన్నట్టు అధికారు లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కార్మికుల మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి. ప్రమాద స్థలంలో రెస్క్యూ టీం, సింగరేణి రెస్క్యూటీం, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, రెవెన్యూ, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. సిగాచి రసాయన ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఎక్కువ మంది ఒడిశా, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు వివిధ రాష్ర్టాలకు చెందిన కార్మికులు మృతిచెందారు.
మృతులు, గల్లంతైన వారి జాడ కోసం వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు మంగళవారం నరకయాతన అనుభవించా రు. అధికారుల సూచనతో దవాఖానకు, కంపెనీకి కాళ్లరిగేలా తిరిగిన ఆచూకీ దొరకక అవస్థలు పడ్డారు. పరిశ్రమ ముందున్న పోలీసులు వారిని లోనికి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు. హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినా డెస్క్‌లో వివరాలు రాసుకోవడమే కానీ ఆచూకీ వెతికేందుకు సాయం చేయడమే లేదు. వీఐపీల తాకిడితో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడం, లా అండ్ ఆర్డర్ కాపాడటంపైనే దృష్టి సారించారు. పరిశ్రమ చుట్టుపక్కల అర కిలోమీటర్ మేర బారికేడ్లు పెట్టి ఎవరినీ లోపలికి రానివ్వడంలేదు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు పోలీసులను బతిమాలడం కనిపించింది. తమ వారు బతికున్నారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారడంతో ఆ కుటుంబాల బాధ వర్ణనాతీతం. డీఎన్ఏ టెస్టులు చేయించుకునేందుకు రక్త నమూనాలు సైతం ఇస్తున్నారు. అధికారుల మధ్య సమన్వయం లేక బాధిత కుటుంబసభ్యులకు తీవ్ర మనోవేదన కలిగిస్తున్నది.
కలెక్టర్, జిల్లా అధికారులు ఇస్తున్నా ఆదేశాలేవీ ప్రమాద స్థలిలో అమలుకావడం లేదు. హెల్ప్‌డెస్క్ మొదట కంపెనీ వద్ద పెట్టారు. సీఎం, వీఐపీలు వస్తున్నారని దానిని టీఎస్ఐఐసీ కార్యాలయ ఆవరణలో పెట్టారు. విష యం తెలియని బాధిత కుటుంబాలు పోలీసులను బతిమాలుకొని కంపెనీ వద్దకు వస్తే హెల్ప్‌డెస్క్ అక్కడి నుంచి మార్చారని అధికారులు సమాచారం ఇస్తున్నారు. మరో పక్క తమ వారి వివరాలు హిందీలో చెబితే అధికారులకు అర్థం కావడం లేదు. మరోపక్క ఇంత దారుణం జరిగినా పరిశ్రమ యాజమాన్యాలు అక్కడ కనిపించలేదు. పరిశ్రమ సిబ్బంది అయినా సహకరిస్తే గాయపడ్డవారిని, మరణించిన వారిని గుర్తించడం సులభతరం అవుతుంది. అధికారులకు కూడా పరిశ్రమ కార్మికులను గుర్తించడం తలనొప్పిగా మారుతున్నది.
పటాన్చెరు ఏరియా సర్కార్ దవాఖాన వద్ద పాశమైలారం సిగాచీ ఫ్యాక్టరీ ప్రమాదంలో చనిపోయిన కార్మికుల మృతదేహలను కుప్పలుగా పడేశారు. ఆ మృతదేహాలు గుర్తుపట్టే స్థితిలో లేకపోవడంతో డీఎన్ఏ పరీక్షలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డీఎన్ఏ పరీక్షల ద్వారానే గుర్తించి, కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం గదిలో కుప్పలుగా పడేయడంతో మృతుల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మా బామ్మర్ది కొడుకు సిద్ధార్థగౌడ విధులకు వచ్చాడు. పేలుడు తర్వత అతని జాడలేదు. నిన్నటి నుంచి వెతుకుతున్నాం. కానీ అతడి అడ్రస్ లభించడం లేదు. దవాఖానకూ వెళ్లాం.. అక్కడ కూడా కనిపించలేదు. చివరకు మార్చురీలోనూ వెతికినా కనిపించలేదు. అధికారులు అటూ ఇటు తిప్పుతున్నారు.
– కృష్ణగౌడ్
నా ఫ్రెండ్ లేబర్ కాంట్రాక్టర్. అతడి కాంట్రాక్టులో సిగాచిలో 18 మంది కార్మికులుగా పనిచేస్తున్నారు. సోమవారం మొదటి షిప్టునకు వెళ్లినవారు పేలుడులో చిక్కుకున్నారు. వారిలో ఐదుగురు కార్మికులు కనిపించడం లేదు. గల్లంతైన వారిలో కొందరు దవాఖానల్లో కనిపించారు. ఐదుగురి జాడకోసం వెతుకుతు న్నాం. పాశమైలారం గ్రామం నుంచి చాలామంది గల్లంతయ్యారు. హెల్ప్‌డెస్క్‌లో పేర్లు రాయించినా ప్రయోజనం లేదు. కొన్ని శవాలు కాలి బూడిదయ్యాయి. గుర్తుపట్టలేము. అధికారులు, పరిశ్రమ యాజమాన్యం జాడ చెప్పడమే లేదు. ప్రభుత్వ స్పందన సరిగా లేదు. రెండు రోజులైనా ఎంతమంది గాయపడ్డారు. ఎంతమంది మిస్ అయ్యారు. ఎందరు చనిపోయారో వివరాలు ఇవ్వడం లేదు.
మాది నిజామాబాద్ జిల్లా బోధన్. నా సోదరుడి కుమారుడు అభిరెడ్డి పేలుడులో కాలిపోయాడు. దవాఖానలో ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం పరిశ్రమ యజమానుల నిర్లక్ష్యం. వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇలాంటి పరిశ్రమలపై గట్టి చర్యలు తీసుకోలేదు. గతంలోనూ ఈ పరిశ్రమలో ప్రమాదాలు చోటుచేసుకున్నా చర్యలు తీసుకోలేదు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలె. బాధితులకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి.
మాది బీహార్. ఇస్నాపూర్‌లో ఉంటున్నాం. నా భార్య రుక్సానా ఖాతూన్ సిగాచి పరిశ్రమలో పనిచేస్తున్నది. జనరల్ షిప్టు డ్యూటీకి వచ్చింది. పేలుడులో రుక్సానా ఖాతూన్ చనిపోయింది. శవం గుర్తుపట్టాం. ఇప్పుడు శవాన్ని ఖననం చేయాలి. బీహార్‌కు శవాన్ని తీసుకెళ్లాలి. పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని బయటపెట్టారు. తీసుకెళ్లేందుకు మా వద్ద అన్ని పైసల్లేవు. ఎట్ల తీసుకెళ్లాలి. చిన్న పిల్లలున్నారు. వారు తల్లికోసం ఏడుస్తున్నారు. ప్రభుత్వం మా గోడు పట్టించుకొని సాయం చేయాలి.
నా దోస్తు తస్లిం అన్సారీ సిగాచి కంపెనీలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. పేలుడు జరిగినప్పుడు డ్యూటీలోనే ఉన్నాడు. పేలుడు తర్వాత అతడి అడ్రస్ కానీ, శవం కానీ దొరకడం లేదు. అన్ని దవాఖానల్లో తిరిగాను. జాడ లేదు. అధికారులు దవాఖానకు వెళ్లమంటున్నారు. అక్కడ నుంచి వస్తే ముద్దగా మారిన శవాలను చూపిస్తున్నారు. నిన్నటి నుంచి అన్ని చోట్ల దోస్తు కోసం తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
మా డాడీ దాసరి రామాంజనేయులు కనిపించడం లేదు. సోమవారం జనరల్ షిప్టు డ్యూటీకి వెళ్లాడు. బ్లాస్టింగ్ అయ్యిందని వచ్చి వెతికాను. జాడ దొరకలేదు. నిన్నటి నుంచి అన్ని దవాఖానల్లోనూ వెతికాను. ఎక్కడా కనిపించలేదు. చివరికి పోస్టుమార్టం వద్ద ఉన్న శవాలను కూడా చూసినా అక్కడాలేడు. మా డాడీ కోసం ఇంట్లో అందరూ పరేషాన్లో ఉన్నరు. అధికారులు పట్టించుకోవడం లేదు.
నా భర్తతోపాటు మావాళ్లు నలుగురు డ్యూటీకి వచ్చి కనిపిస్తలేరు. నా భర్త పేరు నాగప్రసాద్, మావారి బాబాయి దబ్లూ, సొదరుడు దీపక్, పెద్దనాన్న దిలీప్ కనిపించడం లేదు. నేను ఏడు నెలల గర్భిణిని. నాకు ఏడాదిన్నర బాబు ఉన్నాడు. నాకు పుట్టింటివారు ఎవరూ లేరు. నాకు దిక్కు నా భర్త, వారి కుటుంబ సభ్యులే. వారందరూ కంపెనీలో డ్యూటీకి వెళ్లి బ్లాస్టింగ్ తర్వాత మాయమైర్రు. అధికారులను అడిగితే పేర్లు రాసుకుని పొమ్మన్నరు. దవాఖానలో చూస్తే వారి జాడలేదు. నేనేమి చేయాలో అర్థం కావడం లేదు. నా అనే వారెవరూ లేకుండా పోయారిప్పుడు. మా వాళ్ల జాడ దొరికేలా సాయం చేయండి. – పూజాదేవి
మాది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా అరదిడి గ్రామం. నా కుమారుడు సునీల్‌కుమార్ (24) సిగాచి ఫ్యాక్టరీ ల్యాబ్‌లో పనిచేస్తాడు. సోమవారం ప్రమాదం జరిగిందని తెలవగానే పటాన్చెరు దవాఖానకు వచ్చాం. ఇప్పటివరకు ఎవరూ మా కుమారుడి సమాచారం ఇవ్వడం లేదు. ఉదయం నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉద్యోగం కోసమొచ్చి కనిపించకుండా పోయాడు. అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు.
నా కొడుకు జీ వెంకట్ (27) నాలుగేండ్లుగా సిగాచి ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫ్యాక్టరీ ప్రమాదం గురించి టీవీలో చూసి ఏపీలోని శ్రీకాకుళం నుంచి వచ్చా. ఫ్యాక్టరీ యాజమాన్యం, అధికారులెవరూ సమాచారం ఇవ్వలేదు. పాశమైలారం ఫ్యాక్టరీ వద్ద ఎవ రూ నా కొడుకు సమాచారం ఇవ్వలేదు. రాత్రి నుంచి పటానుచెరు సర్కారు దవాఖాన వద్ద ఉన్నా.. మా అబ్బాయి సమాచారం ఇవ్వడం లేదు. ఎక్కడ ఉన్నడో తెలపాలని అధికారులను కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉపాధి కోసం వచ్చిన కొడుకు కనిపించకుండా పోయాడు.
మా మిత్రుడు సాంబురామ్(51) మేము ఉపాధి కోసం బీహార్ నుంచి ఇక్కడికి వచ్చాం. సోమవారం సిగాచి ఫ్యాక్టరీలో పనిచేసేందుకు వెళ్లాడు. ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగినప్పుటి నుంచి కనిపించడం లేదు. ఫ్యాక్టరీ వద్ద, పటాన్చెరు దవాఖాన వద్ద కూడా ఎవరూ సాంబురామ్ సమాచారం ఇవ్వడం లేదు. పోస్టుమార్టం గది వద్ద మృతదేహాన్ని గుర్తుపట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. సాంబురామ్కు ముగ్గురు కుమారులు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు.