సిద్దిపేట : విత్తనోత్పత్తికి సిద్దిపేట జిల్లా అన్ని విధాలా అనుకూలంగా ఉందని, త్వరలోనే సిద్దిపేట సీడ్ హబ్‌గా మారనుంది అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ భవనానికి, విత్తన గోదాము నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. కేంద్రం వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేసిందన్నారు. రైతుల పోరాటంతోనే నల్ల చట్టాలను రద్దు చేశారు. ఆహార భద్రత అంశం కేంద్రం పరిధిలో ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రానిది ద్వంద్వ నీతి అని దుయ్యబట్టారు. కేంద్రం ద్వంద్వ నీతిని రైతులకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలను రైతులు సాగు చేయాలి. విత్తనోత్పత్తికి సిద్దిపేట జిల్లా అన్ని విధాలా అనుకూలంగా ఉందన్నారు. త్వరలోనే సిద్దిపేట సీడ్ హబ్‌గా మారనుంది. రాష్ట్రంలో 5 జిల్లాలో సీడ్ కార్పొరేషన్‌కు కార్యాలయాలు ఉన్నాయి. సిద్దిపేటది ఆరవ కార్యాలయం అని తెలిపారు. ఏఎంసీలోని షెడ్లకు, గోదాములకు ప్రత్యేక పేర్లు పెడుతామన్నారు. దీంతో రైతులు, హమాలీలు, లారీ డ్రైవర్లు సులువుగా గుర్తించేందుకు వీలు ఉంటుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.