చిన్నకోడూరు, మార్చి 14 : కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ సొసైటీ మాజీ చైర్మన్ మూర్తి బాల్‌రెడ్డి కుమారుడు సాయి చరణ్‌రెడ్డి (29) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. సాయిచరణ్‌రెడ్డి కొన్నేండ్లుగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఏడాది క్రితమే పెండ్లి జరిగింది. 3 నెలల క్రితం దంపతులిద్దరూ అమెరికా నుంచి కెనడాకు వెళ్లారు. అక్కడ ఇద్దరూ ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేస్తున్నారు. సాయిచరణ్‌రెడ్డి సోదరి సుమలత కూడా కెనడాలోనే ఉంటుంది. పది రోజుల క్రితం ఆమె సాయిచరణ్‌కు ఫోన్ చేయగా ఎంతకూ కలవకపోవడంతో ఆరా తీయగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు అక్కడి పోలీసులు వెల్లడించారు. పది రోజులుగా సోదరి సుమలత తల్లిదండ్రులకు విషయం చెప్పలేక కుమిలిపోయింది. విషయం తెలుసుకొన్న మంత్రి హరీశ్‌రావు ఆదివారం రాత్రి సిద్దిపేటలో నివాసముంటున్న బాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.