హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ):సావు భాష మాట్లాడడం తప్పా.. సాగుపై సోయిలేని రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో యూరియా కొరత, రైతుల కష్టాల నేపథ్యంలో సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాగు గురించి అవగాహనలేని రేవంత్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని వాపోయారు. ‘అందరినీ తొక్కుకుం టూ వచ్చానని గర్వంగా చెప్పుకునే నీవు.. నీ చెత్త పాలనతో ఇప్పుడు రైతాంగాన్ని తొక్కుతున్నావు.. నీ చిల్లర రాజకీయాలకు, విధ్వంసకర సాగు వ్యతిరేక విధానాలకు బలవుతున్నది రైతే..’ అని విమర్శలు గుప్పించారు. సాగు సమయానికి యూరియా అందించని నువ్వు.. ముఖ్యమంత్రివా? అని ప్రశ్నించారు.
యాసంగి ఆరంభంలో రైతులు యూరియా కోసం అరిగోస పడుతుంటే కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తున్నదని నిలదీశారు. రేవంత్ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చుంటే, అన్నదాతలు మాత్రం తెల్లవారుజాము నుంచే చలిలో గజగజ వణుకుతూ యూరియా బస్తాల కోసం ఎదురుచూస్తున్నారని ధ్వజమెత్తారు. ‘యూరియా కొరత సృష్టించి సాగును సంక్షోభంలోకి నెట్టడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పా? గత సీజన్లో ఎదురైన యూరియా కొరత చేదు అనుభవాల నుంచి రేవంత్ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదా? యూరియా కొరతను దాచిపెట్టేందుకు తెచ్చిన యాప్ ఏమైంది? కాంగ్రెస్ ఉన్నంతకాలం రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడాల్సిందేనా?’అంటూ సూటి గా ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రైతుల యూరియా ఇక్కట్లను తీర్చాలని డిమాండ్‌చేశారు.