దహెగాం, డిసెంబర్ 23: కరోనా టీకా వేసుకోవాలని వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి వైద్య సిబ్బందిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన ఎస్సై.. సదరు వ్యక్తికి కౌన్సెలింగ్ నిర్వహించి పోలీస్ స్టేషన్లోనే వ్యాక్సిన్ వేయించారు. ఆసక్తికరమైన ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాంలో చోటుచేసుకున్నది.
దహెగాం మండల కేంద్రంలో గురువారం వైద్య, అంగన్వాడీ, రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేస్తున్నారు. ఎగ్గె సిద్ధయ్య ఇంటికి వెళ్లి వ్యాక్సిన్ వేసుకోవాలని కోరగా, అందుకు తిరస్కరించాడు. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్సై రఘుపతికి ఫిర్యాదు చేశాడు. ఆశ్చర్యపోయిన ఆయన సిద్ధయ్యకు కౌన్సెలింగ్ నిర్వహించి టీకా తీసుకునేలా ఒప్పించారు. వెంటనే వైద్య సిబ్బందిని పోలీస్ స్టేషన్కు పిలిపించి అతడికి వ్యాక్సిన్ వేయించారు.