Chanduru | చండూరు, జూన్ 27: ‘ఈ నెల 26న చండూరు ఎస్సై నర్సింగ్ వెంకన్న నన్ను స్టేషన్‌కు పిలిపించారు. వెళ్లీ వెళ్లగానే నా చెవులతో వినలేని దుర్భాషలాడుతూ, కడుపులో పిడిగుద్దులు గుద్దుతూ, కింద పడేసి బూటుకాలితో తన్నుతూ తలపై బలంగా కొట్టాడు’ అని నల్లగొండ జిల్లా చండూరు మండలం తాస్కానిగూడెం గ్రామానికి చెందిన నిరుపేద రైతు ఆవుల వెంకన్న ఆవేదన వ్యక్తంచేశాడు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్సై దౌర్జన్యం గురించి, తనకు జరిగిన అన్యాయంపై వివరించాడు. గత నెల 23న తన పొలం పక్కన ఉన్న తన బాబాయ్‌తో గెట్టు పంచాయితీ విషయమై గొడవ జరిగిందని వెంకన్న తెలిపాడు. దీంతో తనపై తన బాబాయి కుటుంబం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపాడు. ఈ సమస్యను గ్రామంలోనే పరిష్క రించుకోవాని ఇరువర్గాలకు, గ్రామ పెద్దలకు ఎస్సై చెప్పగా, ఇరువర్గాలకు పెద్దమనుషులు పరిష్కారం చూపాలని చూస్తే అవతలివర్గం వారు వినిపించుకోలేదని చెప్పాడు.
ఎస్సై తనను ఈనెల 26న స్టేషనుకు పిలిపించారని, పెద్ద మనుషులు చెప్పినట్టు ఎందుకు వినడం లేదంటూ ఏకంగా తనపైనే దాడికి దిగారని చెప్పాడు. తానే పెద్ద మనిషిని అంటూ ఎస్సై మాటల్లో చెప్పలేని రీతిలో తననే బూతులు తిట్టారని, కడుపులో పిడిగుద్దులు గుద్దుతూ, బూటుకాళ్లతో తన్నాడని రైతు తెలిపారు. ఈ దాడిలో తన తలకు బలంగా దెబ్బ తగిలిందని చెప్పాడు. తన తప్పు లేకున్నా ఎందుకు కొడుతున్నారని, ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ఎస్సైతో తాను చెప్పానని రైతు తెలిపాడు. దీంతో ఎస్పీకి కాదు.. నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ తీవ్రమైన పదజాలంతో దూషించాడని చెప్పాడు. ఎస్సై దాడిలో తాను స్పృహతప్పి పడిపోగా తన కుటుంబ సభ్యులు వెంటనే దవా ఖానకు తరలించి, చికిత్స చేయించారని చెప్పాడు. తనకు జరిగిన అన్యాయం, మరో బాధితునికి జరగకుండా ఉండాలంటే చండూరు ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని కలిపి ఫిర్యాదు చేయనున్నట్టు రైతు ఆవుల వెంకన్న తెలిపాడు.