కంది, జూలై 13: పట్టుదలతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదని భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్, యాక్సియమ్-4 వ్యోమగామి శుభాంశు శుక్లా సూచించారు. సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ఎక్స్ట్రా మ్యూరల్ లెక్చర్స్ (ఈఎంఎల్)కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత మానవ అంతరిక్ష యాత్ర, భారత వైమానికదళ పైలట్ నుంచి వ్యోమగామిగా మారిన తన ప్రయాణాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. విద్యార్ధి దశ నుంచే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. అంతరిక్ష అన్వేషణ, నాయకత్వం, శాస్త్రీయ ఆవిష్కరణలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. అనంతరం తన అంతరిక్ష యాత్ర అనుభావాలతో రూపొందించిన ద సెకండ్ ఆర్బిట్ బుక్‌ను ఆవిష్కరించారు. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. వ్యోమగామి శుభాంశు శుక్లాను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఐఐటీహెచ్‌లో స్పేస్ ఇంజనీరింగ్ కోర్సును ప్రారంభించే దిశగా ఆలోచిస్తున్నట్టు తెలిపారు.